ఎయిడ్స్.. ఇప్పుడు కాదు కానీ.. ఓ పది పదిహేనేళ్లకింద ఎయిడ్స్ పేరు ఎత్తితేనే గజగజా వణికేవారు. పులిరాజాకు కూడా ఎయిడ్స్ వస్తుందంటూ ప్రచారం చేసేవాళ్లు. అసురక్షిత శృంగారం వల్ల, రక్త మార్పిడి వల్ల.. ఇలా పలు రకాలుగా సోకే ఎయిడ్స్ వ్యాధికి చికిత్స లేదు. అంటే ఎయిడ్స్ వస్తే ట్రీట్ మెంట్ తీసుకోవడం తప్పితే దానికి పూర్తిస్థాయిలో దాన్ని నయం చేయలేం.
అయితే.. గత కొన్నేళ్లుగా ఎయిడ్స్ వ్యాధిని పూర్తిగా నయం చేయడం కోసం పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఈ పరిశోధనల్లో డాక్టర్లు ఒక అడుగు ముందుకు వేశారు. స్టెమ్ సెల్ ట్రాన్స్ ప్లాంట్ ద్వారా అంటే మూలకణాల మార్పిడి ద్వారా ఎయిడ్స్ ను నయం చేయొచ్చని పరిశోధనలో తెలుసుకున్నారు. అలా.. లండన్ లో హెచ్ఐపీ వైరస్ సోకిన ఓ వ్యక్తికి మూలకణాలు మార్పిడి చేసి విజయం సాధించారు.
ఆ చికిత్స చేసిన తర్వాత ఆ పేషెంట్ ఎటువంటి మందులు వాడటం లేదట. గత 18 నెలల నుంచి ఆ వ్యక్తి హెచ్ఐవీకి సంబంధించిన ఎటువంటి ట్రీట్ మెంట్ కానీ.. మందులు గానీ వాడనప్పటికీ అతడి కండీషన్ నార్మల్ గానే ఉందట. అయితే.. ఆ వైరస్ పూర్తిగా నాశనమైందని చెప్పలేనప్పటికీ.. కొంతవరకైతే హెచ్ఐవీ వైరస్ ను తగ్గించగలిగారు డాక్టర్లు.
ఇప్పటివరకు హెచ్ఐవీ నుంచి కొంతవరకు తప్పించుకున్న వ్యక్తుల్లో ఇతడు రెండో వ్యక్తి. ఇదివరకు బెర్లిన్ లో కూడా ఓ హెచ్ఐవీ పేషెంట్ కు బోన్ మారో ట్రాన్స్ ప్లాంట్ ద్వారా హెచ్ఐవీని తగ్గించగలిగారు. అయితే.. దీనిపై ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని… ఈ వైరస్ ను పూర్తిగా నిరోధించగలిగినప్పుడే ఇన్నేళ్లుగా జరుగుతున్న పరిశోధనకు సార్థకత లభిస్తుందని పరిశోధకులు చెబుతున్నారు.