గాలి తీసేశారుగా: యనమల పరిజ్ఞానం… ఉమ్మారెడ్డి వెటకారం!

-

పాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులను ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపాలని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌కు ఏపీ శాసన మండలిలో ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆయన క్రమంలో మరికొంతమంది టీడీపీ నేతలు.. టీడీపీ క్షేమం కోరే బీజేపీ నేతలూ లేఖలు రాశారని కామెంట్లు వచ్చాయి కూడా! ఆ సంగతులు అలా ఉంటే… తాజాగా యనమల రాసిన లేఖపై స్పందించారు శాసన మండలి ప్రభుత్వ చీఫ్‌ విప్‌ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు!

శాసనసభల నిర్వహణ అనేది రాజ్యాంగ నిబంధనలకు లోబడి ఉంటుందనే కనీస పరిజ్ఞానం యనమలకు లేకపోవడం శోచనీయం అని మొదలుపెట్టిన ఉమ్మారెడ్డి… 192 (2) (బి) ప్రకారం తొలుత అసెంబ్లీ పంపిన బిల్లును మూడు నెలల తరువాత కూడా కౌన్సిల్‌ ఆమోదించకపోతే.. దానిని ఆమోదించనట్లేనని గుర్తు చేశారు. అనంతరం రాజ్యాంగం ప్రకారం మళ్లీ రెండోసారి కూడా ఏదైనా ఒక బిల్లును అసెంబ్లీ ఆమోదించి పంపినప్పుడు.. మండలి ఆమోదించని పక్షంలో… ద్రవ్య బిల్లు అయితే 15 రోజులు, సాధారణ బిల్లు అయితే 30 రోజుల తరువాత ఆమోదం పొందినట్లుగానే పరిగణిస్తారని… డీండ్ టు బి పాస్డ్ సంగతినీ గుర్తుచేశారు.

రాష్ట్ర మంత్రివర్గం ఈ రెండు బిల్లులను ఆమోదించి ఆ తర్వాత.. లేదా రాజ్యాంగం ప్రకారం ఆమొదించబడినట్లు నిర్ధారణ అయిన అనంతరమే గవర్నర్‌ ఆమోదానికి పంపుతారని గుర్తుచేసిన ఉమ్మారెడ్డి… గవర్నర్‌ ఆమోదించకుండా రాష్ట్రపతికి పంపాలని సూచించడం అంటే యనమల సంకుచితత్వానికి నిదర్శనం అని స్పష్టం చేశారు. ఫైనల్ గా… గవర్నర్‌ ఆమోదానికి పంపిన బిల్లును ఆమోదించవద్దని చెప్పి ఇంకా ప్రజల దృష్టిలో ఎందుకు నవ్వులపాలవుతారు అంటూ ముగించారు ఉమ్మారెడ్డి!!

Read more RELATED
Recommended to you

Latest news