కరోనా సోకిన వారు ఉండే ప్రదేశంలోని గాలిలో ఆ వైరస్ కణాలు ఉంటాయని, అందువల్ల గాలి ద్వారా కూడా కరోనా వ్యాప్తి చెందుతుందనే విషయాన్ని ఇప్పటికే పలువురు సైంటిస్టులు చెప్పిన సంగతి తెలిసిందే. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. అయితే ఇప్పుడిదే విషయంపై సీఎస్ఐఆర్ చీఫ్ శేఖర్ సి మండే ముఖ్యమైన వివరాలను తెలియజేశారు. కేవలం బయటకు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా, ఆఫీసుల్లోనూ మాస్కులను ధరించాలని అన్నారు.
జనం ఎక్కువగా ఉండే ప్రదేశాలకు వెళ్లకపోవడమే మంచిదని శేఖర్ అన్నారు. పనిచేసే ప్రదేశాల్లో గాలి వెలుతురు ఎక్కువగా వచ్చేలా చూసుకోవాలన్నారు. కరోనాను కట్టడి చేయాలంటే మాస్కులను కచ్చితంగా ధరించాలని అన్నారు. కరోనా సోకిన వారు దగ్గినా, తుమ్మినా పెద్ద తుంపర్లు ఉపరితలాలపై పడతాయని, కానీ చిన్న తుంపర్లు మాత్రం గాల్లో ఎక్కువ సేపు అలాగే ఉంటాయని అన్నారు. అందువల్ల ఆ గాలిని పీలిస్తే కరోనా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నారు.
కాగా కరోనా గాలి ద్వారా వ్యాప్తి చెందుతుందని ఇటీవలే ప్రపంచంలోని పలువురు సైంటిస్టులు ప్రపంచ ఆరోగ్య సంస్థకు లేఖ రాయగా, ఆ విషయాన్ని పరిశీలించిన ఆ సంస్థ అది నిజమేనని తేల్చింది. అందువల్ల కరోనాను కట్టడి చేయాలంటే.. మాస్కు తప్పనిసరి అని చెబుతున్నారు.