ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్థాన్‌కు గట్టి షాక్ తగిలింది. పాక్ గడ్డపై నుంచి పనిచేస్తున్న ఉగ్రమూకలపై ఇరాన్ మెరుపుదాడి చేసింది. సరిహద్దులు దాటి పాక్‌లోకి చొచ్చుకొచ్చి మరీ… తన పని పూర్తి చేసి వెళ్లారు ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్. రెండున్నరేళ్లుగా ఉగ్రవాదుల చెరలో ఉన్న తమవాళ్లు ఇద్దర్ని విడిపించుకుని మరీ.. తీసుకెళ్లారు ఇరాన్ సైనికులు. ఇరాన్ ఊహించనిరీతిలో పాక్ కి షాకిచ్చింది.
పాకిస్థాన్‌కు ఊహించని షాక్ తగిలింది. ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ కోర్ -IRGCకు చెందిన ప్రత్యేక దళం అకస్మాత్తుగా సర్జికల్ స్ట్రైక్ చేసింది. జైష్ అల్ అదల్ ఉగ్రవాదులతో పాటు వాళ్లకు రక్షణగా ఉన్న పాక్ సైనికులు కొందర్ని మట్టుబెట్టింది. రెండు రోజుల క్రితం అర్థరాత్రి సమయంలో ఈ సర్జికల్ స్ట్రైక్ నిర్వహించింది ఇరాన్.
ఇరాన్-పాకిస్థాన్ సరిహద్దు ప్రాంతంలో ఉగ్రవాద సంస్థ జైష్ అల్ అదల్ పని చేస్తోంది. ఇరాన్‌లో గల బలోచ్ సున్నీల హక్కుల కోసం పోరాడుతున్నట్టు చెప్పుకుంటోంది జైష్ అల్ అదల్. అయితే, పాకిస్థాన్ సైన్యం అండదండలతో ఇరాన్‌కు వ్యతిరేకంగా సాయుధ పోరాటం చేస్తోంది. 2018 అక్టోబర్లో ఇరాన్-పాక్ సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న 12 మంది IRGC సైనికుల్ని జైష్ అల్ అదల్ కిడ్నాప్ చేసింది. దీంతో పాకిస్థాన్‌తో చర్చలు జరిపింది ఇరాన్. ఇరు దేశాల సైనిక అధికారులతో ఉమ్మడి కమిటీని ఏర్పాటు చేశారు. 2018 నవంబర్‌లో ఐదుగురు ఇరాన్ సైనికుల్ని విడిపించగలిగారు. అలాగే, 2019 మార్చిలో మరో నలుగురు ఇరాన్ సైనికుల్ని… పాక్ సైన్యం రక్షించింది. ముగ్గురు ఇరాన్ సైనికుల ఆచూకీ లభ్యం కాలేదు.
జైష్ అల్ అదల్ వద్ద బందీగా ఉన్న తమ సైనికులకు సంబంధించిన పక్కా సమాచారాన్ని నిఘా వర్గాల ద్వారా సేకరించింది IRGC. పాకిస్థాన్‌కు ఎలాంటి సమాచారమివ్వకుండా దాడి చేసింది. పూర్తిగా పాకిస్థాన్ ఆధీనంలోని ప్రాంతం ఉన్న జైష్ అల్ అదల్ అడ్డాపై చీకట్లో మెరుపు దాడి చేసింది IRGC కమాండో బృందం. జైష్ అల్ అదల్ అడ్డాకు రక్షణ కల్పిస్తున్న కొంత మంది పాకిస్థాన్ సైనికుల్ని కూడా మట్టుబెట్టి… ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్న ఇద్దరు సైనికుల్ని విడిపించుకుని తీసుకెళ్లింది IRGC.
జైష్ అల్ అదల్ పాకిస్థాన్ ఆర్మీ నుంచి పూర్తి అండదండలు లభిస్తున్నాయి. 2014లో కూడా ఐదుగురు ఇరాన్ సైనికుల్ని బలోచిస్థాన్‌లో కిడ్నాప్ చేసింది జైష్ అల్ అదల్. కొన్ని నెలలు తర్వాత నలుగుర్ని విడుదల చేసింది. ఓ సైనికుడ్ని కాల్చి చంపింది. నెలల తర్వాత అతని మృతదేహాన్ని ఇరాన్‌కు పంపింది జైష్ అల్ అదల్. అనేక సార్లు ఇరాన్‌తో పాటు పాకిస్థాన్‌లో పలు ఆత్మాహుతి దాడులకు పాల్పడింది జైష్ అల్ అదల్.
పాకిస్థాన్ అంటే ఉగ్రవాదులకు స్వర్గధామం. గత కొన్ని దశాబ్దాల్లో అనేక టెర్రరిస్టు గ్రూపులు పాకిస్థాన్ గడ్డపై పురుడు పోసుకున్నాయి. స్వయంగా పాకిస్థాన్ సైన్యం ఉగ్రవాదులకు అవసరమైనవన్నీ సమకూర్చుతోంది. ఇలా పెంచి పోషించిన ఉగ్రవాదాల్ని పొరుగు దేశాల్లో విధ్వంసాలకు పురిగొల్పడం పాకిస్థాన్‌కు అలవాటుగా మారింది. అయితే, పాకిస్థాన్‌పై సర్జికల్ స్ట్రైక్ చేసిన మూడో దేశంగా ఇప్పుడు ఇరాన్ రికార్డు సృష్టించింది. ఇప్పటికే భారత్‌తో పాటు అమెరికా పాకిస్థాన్‌లోని ఉగ్ర స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్‌లు నిర్వహించాయి.