విభజన సమస్యలపై నేడు కేంద్ర హోంశాఖ భేటీ

-

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య విభజన సమస్యలు, వివాదాల పరిష్కారంపై రెండు రాష్ట్రాల అధికారులతో ఇవాళ కేంద్ర హోంశాఖ కార్యదర్శి భేటీ కానున్నారు. విద్యుత్ బకాయిలు, సింగరేణి సంస్థ అనుబంధ ఆప్మెల్, పారిశ్రామిక రాయతీలు, పౌరసరఫరాల సంస్థ నిధులకు సంబంధించిన అంశాలపై చర్చించనున్నారు. దిల్లీలో జరిగే సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం తరపున వినిపించాల్సిన వాదనలపై ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ చర్చించారు. పూర్తి స్పష్టతతో రాష్ట్ర అభిప్రాయాలు స్పష్టం చేయాలని  సూచించారు.

విభజన చట్టం ప్రకారం, న్యాయపరంగా రాష్ట్రానికి రావాల్సిన, కేంద్రం నెరవేర్చాల్సిన వాటి గురించి ప్రస్తావించాలని అధికారులకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. విద్యుత్ బకాయిలను సమావేశంలో ప్రధానంగా ప్రస్తావించేందుకు రాష్ట్ర అధికారులు సిద్ధమయ్యారు. ఏపీకి ఇవ్వాల్సిన 6,700 కోట్లను మినహాయించుకున్నా.. తెలంగాణకి ఇంకా 12వేల కోట్లు ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది.

విభజనచట్టంలోని 9, 10 షెడ్యూళ్లలోని సంస్థలు, సింగరేణి సంస్థ అనుబంధ ఆప్మెల్ విభజన, పన్నులు, నిధులు, తదితర అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ వాదనలు, అభిప్రాయాలను అధికారులు సమావేశంలో మరోమారు వివరించనున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news