మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్‌పై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రశంసలు కురిపించారు. ఆయనకు దేశమంతా ఎల్లప్పుడు రుణపడి ఉంటుందని అన్నారు. మన్మోహన్ ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలను ఉద్దేశిస్తూ గడ్కరీ ఈ వ్యాఖ్యలు చేశారు. భారత్‌లో పేద వర్గాలకు లబ్ధి చేకూర్చే ఉదారవాద ఆర్థిక విధానాల్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని చెప్పారు. దిల్లీలో మంగళవారం జరిగిన ఓ అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో నితిన్ మాట్లాడారు.
1991లో ఆర్థిక మంత్రి హోదాలో మన్మోహన్ చేపట్టిన సంస్కరణలు భారత్‌కు కొత్త మార్గాన్ని చూపెట్టాయని గడ్కరీ కొనియాడారు. ఆ సమయంలో తాను మహారాష్ట్రలో మంత్రిగా ఉన్నానని.. సంస్కరణల వల్లే రోడ్ల నిర్మాణానికి భారీ ఎత్తున నిధుల్ని సమీకరించగలిగానని గుర్తుచేసుకున్నారు. రైతులు, పేదల కోసం మరిన్ని ఉదారవాద సంస్కరణల్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఆర్థిక సంస్కరణలు దేశ అభివృద్ధికి ఎలా దోహదం చేస్తాయో చెప్పడానికి చైనాయే ప్రత్యక్ష ఉదాహరణ అని గడ్కరీ అన్నారు. అలాగే భారత్ ఆర్థికంగా వేగవంతమైన వృద్ధి సాధించాలంటే మరింత మూలధన పెట్టుబడి కావాలని తెలిపారు.