ఆ నేత పెళ్లి ఉత్తరాంధ్ర పొలిటికల్ హీట్ ని చల్లార్చిందా

-

ఉత్తరాంధ్ర రాజకీయాల రూటే సెపరేటు. ఇక్కడ నాయకులు కత్తులు దూసుకుంటారు అంతలోనే ఒక్కటవుతారు.వీరి డైలాగ్ వార్ ఏకంగా సినిమాలనే మించిపోతుంది.రక్తికట్టించే నాటకీయ పరిణామాలు చోటు చేసుకుంటాయి. ఇవన్నీ తెరముందే. తెరవెనక దృశ్యాలు చూస్తే మాత్రం అందరు అవాక్కవ్వాల్సిందే..ఇలాంటి ఆసక్తికర సంఘటనే విజయనగరం వేదికగా జరిగింది.

విజయనగరంజిల్లా రాజకీయాల్లో కీలకం మంత్రి బొత్స సత్యనారాయణ కుటుంబం. ఆయనకు ప్రత్యర్థి కిమిడి ఫ్యామిలీ. గత ఎన్నికల్లో చీపురుపల్లి స్థానం నుంచి బొత్సపై పోటీ చేశారు మాజీ మంత్రి మృణాళిని కుమారుడు నాగార్జున. యువరక్తం ఒకవైపు, రంగరించిన అనుభవం మరోవైపు…ఇంకే ముంది ఎన్నికల ప్రచారం హోరెత్తిపోయింది. సై అంటే సై అనుకున్నారు. ఎన్నికలైపోయాయి. ఎన్నికల్లో గెలిచిన బొత్స ప్రస్తుతం వైసీపీ కేబినెట్లో సీనియర్ మంత్రి. ఎన్నికల తర్వాత ఎవరి రాజకీయాలు, ఎత్తుగడలు వారివి. ఇంతలో కిమిడి నాగార్జునకు పెళ్లి కుదిరింది.

బొత్సకు ఫోన్ చేసి సాదరంగా ఆహ్వానించారు నాగార్జున. ప్రత్యర్థి అయినా పెళ్లికొడుకు కదా.. బొత్స సత్యనారాయణ కూడా తన పెద్దరికాన్ని నిలబెట్టుకున్నారు. భార్యతో సహా వెళ్లి వధూవరులను ఆశీర్వదించారు. కొత్త జంటకు బట్టలు పెట్టారు. పెళ్లి మండపంలో కనిపించిన ఈ దృశ్యం అతిథులను కళ్లు తిప్పుకోనివ్వలేదు. కిమిడి నాగార్జున పెళ్లి వేదికపైనే మరో ఆసక్తికరమైన దృశ్యం ఇప్పుడు వైరల్‌ అవుతోంది. అది కూడా ఇద్దరు ఎమ్మెల్యేలది కావడం హాట్ టాపిక్. వారే విశాఖజిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్.

వెలగపూడి బినామీ ఆస్తుల వ్యవహారం రెండురోజుల పాటు రాష్ట్ర రాజకీయాల్లో చర్చకు దారితీసింది. విశాఖ తూర్పు నియోజకవర్గం వేదికగా పొలిటికల్ హైడ్రామా నడించింది. ఎమ్మెల్యే బినామీ ఆస్తుల చిట్టా ఇదిగో అని బయట పెట్టింది వైసీపీ. దీనికి వెలగపూడి రియాక్షన్‍ వాతావరణాన్ని హీటెక్కించింది. సత్య ప్రమాణాలు, సవాళ్లు, ప్రతి సవాళ్లు.. స్థాయిలు, అంతస్తులు, హత్యా నేరాలు, ఖూనీకోర్లు.. ఒక్కటేమిటి రాజకీయ నాయకులు ఎన్ని మాట్లాడుకుంటారో.. అన్ని మాటలు అక్కడ వినిపించాయి.

రోజంతా కత్తులు దూసేసుకున్న వెలగపూడి, గుడివాడ అమర్నాథ్‌లు సాయంత్రానికి ఒకే వేదికపై ప్రత్యక్షమయ్యారు. అదే టీడీపీ నాయకుడు నాగార్జున పెళ్లి మండపం. ఇద్దరు ఎమ్మెల్యేలు పెళ్లికొడుక్కి అటు ఇటూ నిలబడి ఫోటోలకు ఫోజులిచ్చారు. చిరునవ్వులు చిందించారు. ఈ ఫోటోలు బయటకు రావడంతో పొలిటికల్ సర్కిల్స్‌లో వైరల్ అయ్యాయి. రోజంతా వాతావరణాన్ని వేడెక్కించిన వాళ్లు సాయంత్రానికి ఇంత కూల్‌గా ఎలా ఉండగలరు అనే చర్చ జరుగుతోంది. ఏది ఏమైనా ఉత్తరాంధ్ర రాజకీయాలే వేరు అనుకుంటున్నారు జనం.

Read more RELATED
Recommended to you

Latest news