సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్ గా 5 రాష్ట్రాల ఎన్నికలను పేర్కొంటున్నాయి రాజకీయ పార్టీలు. ముఖ్యంగా ఉత్తర్ ప్రదేశ్ లో ఏ రాజకీయ పార్టీ గెలుస్తోందో అని అందరిలోనూ ఆసక్తి నెలకొంది. యూపీ ఎన్నికలు ఇటు బీజేపీకి, అటు ఎస్పీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రతిష్టాత్మకంగా మారాయి. దీంతో అక్కడ హోరాహోరీగా ఎన్నికలు జరుగనున్నాయి. మొదటి విడతకు కొన్ని రోజులు మాత్రమే సమయం ఉండటంతో పార్టీలు తమ మానిఫేస్టోను జనాలకు తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి.
తాజాగా ఈరోజు బీజేపీ పార్టీ తమ మ్యానిఫెస్టోను విడుదల చేయాల్సి ఉంది. అయితే దీనిని వాయిదా వేస్తూ పార్టీ నిర్ణయం తీసుకుంది. లతా మంగేష్కర్ మరణంతో మానిఫేస్టో విడుదలను వాయిదా వేసుకుంది. ఈరోజు ఉదయం భారతరత్న, పద్మవిభూషన్, గాన కోకిల లతామంగేష్కర్ చనిపోయిన విషయం తెలిసిందే. కోవిడ్ తో గత కొన్ని రోజులుగా ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. ఈరోజ ఉదయం మరణించారు. ఆమె మరణానికి సంతాపంగా బీజేపీ ఈ మానిఫెస్టో విడుదలను వాయిదా వేసుకుంది.