తెలంగాణ కాంగ్రెస్‌లో పీసీసీ కొత్త సారథి ఎంపిక కొలిక్కి రాలేదు. ప్రస్తుత పీసీసీ చీఫ్ ఉత్తమ్ కూడా ఈ ఎపిసోడ్‌లోకి ఎంట్రీ ఇవ్వలేదు. ఇంతకీ అధిష్ఠానం మనసులో ఏముంది.. కొత్త కెప్టెన్ ఎవరైతే బాగుంటుందని ఉత్తమ్ అనుకుంటున్నారు..ఆయన నుంచి అధిష్టానం ఎలాంటి కీలక విషయాలు సేకరిస్తుందన్నది ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో ఆసక్తి రేపుతుంది..ఉత్తమ్ ఎవరికి సై అంటారు ఎవరికి చెక్ పెడతారో అన్నది కూడా ఆసక్తి రేకెత్తిస్తోంది…
నూతన పీసీసీ చీఫ్ నియామకంపై అభిప్రాయ సేకరణ కొనసాగుతూనే ఉంది. ఈ వారంలో అధికారిక ప్రకటన వచ్చేట్టు ఉందని అనుకుంటున్నారు. ఏఐసీసీ మాజీ సారథి రాహుల్‌గాంధీ విదేశీ పర్యటనలో ఉండటంతో ఈ ప్రక్రియ ఆలస్యమైందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే అధిష్ఠానం మొదటి నుంచి ఎవరినైతే పీసీసీ అధ్యక్షుడిని చేయాలని అనుకుంటుందో దాంట్లో మాత్రం మార్పు రాలేదని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఎపిసోడ్‌లో తెర మీదకు రాకుండా ఉన్నది పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాత్రమే. కాకపోతే ఒకటి రెండు రోజుల్లో మాట్లాడతానని ఉత్తమ్‌కి రాహుల్ గాంధీ సందేశం పంపారట. ఇంతలో ఆయన విదేశాలకు వెళ్లడంతో ఆ మాటలు జరగలేదు.
కొత్త చీఫ్ నియామకంలో ప్రస్తుత చీఫ్ ఉత్తమ్ అభిప్రాయం కూడా కీలకమే. అయితే.. AICC ఇప్పటికే అన్నిరకాలుగా అభిప్రాయ సేకరణ పూర్తి చేసింది. పార్టీలో కొందరు సీనియర్ నాయకులతో పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాణిక్యం ఠాగూర్.. కేసీ వేణుగోపాల్ లాంటి వారు కూడా మాట్లాడారు. అయితే ఉత్తమ్‌ని మాత్రం ఇంత వరకు ఎవరు టచ్ చేయలేదు. ఇది కూడా మంచిదే అనుకుంటున్నారట కెప్టెన్.
పీసీసీ చీఫ్ రేసులో ఉన్నవాళ్లలో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఉమ్మడి నల్లగొండ జిల్లా వాసే. కానీ.. ఆయనతో ఉత్తమ్‌కు అంత సన్నిహిత సంబంధాలు లేవు. ఉత్తమ్ సారథ్యాన్ని కోమటిరెడ్డి బ్రదర్స్ బాహాటంగానే వ్యతిరేకిస్తుంటారు. అలాంటిది ఇప్పుడు పీసీసీ రేసులో సీరియస్‌గా ప్రయత్నాలు చేసుకుంటున్నారు కోమటిరెడ్డి. ఈ దశలో కాంగ్రెస్‌లో అందరి అభిప్రాయాలు కీలకమే. ఒకవేళ మీ ఛాయిస్ ఏంటని రాహుల్ గాంధీ అడిగితే.. కోమటిరెడ్డి వెంకటరెడ్డి పేరును ఉత్తమ్ చెబుతారా లేదా అన్నది ఆసక్తిగా మారింది. రేస్‌లో ఉన్న మరో ఎంపీ రేవంత్‌రెడ్డితో కూడా ఉత్తమ్‌కు అంత మంచి సంబంధాలు లేవని చెబుతారు. ఢిల్లీలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రేవంత్‌రెడ్డి, మల్లు భట్టివిక్రమార్క పేర్లే నలుగుతున్నాయట. మరి.. వీరిలో ఎవరో ఒకరి గురించి చెప్పాలని హైకమాండ్ అడిగితే ఉత్తమ్ రియాక్షన్ ఎలా ఉంటుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
అసలు కొత్త పీసీసీ చీఫ్ ఎంపిక విషయంలో అధిష్ఠానం ఎలాంటి అభిప్రాయంతో ఉంది? రాహుల్‌గాంధీ ఉత్తమ్‌తో ఏం మాట్లాడతారు? ఈ రెండు ప్రశ్నల విషయంలో ఉత్తమ్ చెప్పే సమాధానం బట్టి తదుపరి చర్చ ఉండే అవకాశం ఉందట. తనకు ఇష్టం లేనివారి పేరును హైకమాండ్ ప్రస్తావిస్తే ఉత్తమ్ సైలెంట్‌గా ఉంటారని అనుకుంటున్నారు. అందుకే ఢిల్లీ మూడ్ తెలుసుకుని స్పందించాలని భావిస్తున్నట్టు సమాచారం. అధిష్ఠానమే ఒక ఆలోచనకు వచ్చేసి.. ఏదో ఒక అభిప్రాయం చెప్పమని ఒత్తిడి చేస్తే ఎలా? తీరా తన అభిప్రాయం చెప్పిన తర్వాత వారికి కాకుండా వేరొకరికి పదవి ఇస్తే ఇంకా ఇబ్బందిగా ఉంటుందనే ఫీలింగ్‌లో ఉన్నారట. ఒకవేళ అధిష్ఠానం తన అభిప్రాయాన్ని అడిగినా అడక్కపోయినా అంత మన మంచికే అని అనుకుంటున్నారట.
ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం పార్టీలో విభేదాలు ఎలా ఉన్నా సొంత జిల్లా వాసిని కాబట్టి ఉత్తమ్ మద్దతు తనకే ఉంటుందని లెక్కలు వేసుకుంటున్నారట. మొత్తానికి ఉత్తమ్ మనసులో ఏముందో కానీ.. హైకమాండ్ అడిగితే మాత్రం తటస్థంగా ఉంటారనే వాదన కూడా వినిపిస్తోంది. మరి.. కెప్టెన్ ఏం చేస్తారో చూడాలి…