ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ప్రయాణికులతో వెళ్తున్న వాహనం కాలువలో పడటంతో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదంలో 13 మంది మరణించగా నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుల్హాద్- బైలా రహదారిపై ప్రమాదం జరిగింది. దాదాపు 300 మీటర్ల లోతులో ఉన్న లోయలో వాహనం పడిపోయింది. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రడూన్ నుంచి 170 కిలోమీటర్ల దూరంలో చక్రతా తాహసీల్ లోని టియుని ప్రాంతంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఘటనా స్థలం నుంచి మరణించిన వారి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు చక్రతా స్టేషన్ హౌజ్ ఆఫీసర్ సతేంద్ర బాటి తెలిపారు. ప్రమాదం జరిగిన వెంటనే స్థానిక గ్రామస్థులు సహాయసహకారాలతో రక్షణ చర్యలు ప్రారంభించినట్లు ఆయన వెల్లడించారు. ప్రమాదం జరిగిన ప్రాంతం మారుమూల ప్రాంతం కావడంతో రెస్క్యూ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకోవడంలో ఇబ్బందులు ఏర్పడ్డాయి.
సంఘటన వార్త తెలిసిన వెంటనే ఉత్తరాఖండ్ ప్రతిపక్ష నేత ప్రీతమ్ సింగ్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఘటనపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి విచారం వ్యక్తం చేశారు. చక్రతా రోడ్డు ప్రమాదంపై సీఎం ధామి మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు. వాహనాల్లో ఓవర్‌లోడ్ లేకుండా చూసుకోవాలని, ఇలాంటి సంఘటనలు కనిపిస్తే చర్యలు తీసుకోవాలని రవాణా శాఖను ఆదేశించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వాహనాలపై ఓవర్‌లోడ్‌ను అనుమతించవద్దని రాష్ట్ర ప్రజలకు విజ్ఞప్తి చేశారు.