కృష్ణా జిల్లా గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ పార్టీ మార్పుపై గత రెండు మూడు రోజులుగా వెలువడుతోన్న వార్తలు తెలుగు రాజకీయ వర్గాల్లో తీవ్ర ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే వంశీ రెండు రోజుల్లోనూ ఏకంగా మూడు పార్టీల అధినేతలతో భేటీ అవ్వడంతో వంశీ పొలిటికల్ రూటు ఎలా ఉంటుందో ? కూడా ఎవ్వరికి అర్థం కాలేదు.
ఈ వార్తల నేపథ్యంలో సీఎం జగన్‌తో శుక్రవారం వల్లభనేని వంశీ సమావేశమైన సంగతి తెలిసిందే. మంత్రులు కొడాలి నాని, పేర్ని నానితో కలిసి సీఎం వద్దకు వంశీ వెళ్లారు. దాదాపు 45 నిమిషాలపాటు సీఎంతో వంశీ సమావేశమై పార్టీ మార్పుపై చర్చించినట్టు తెలుస్తోంది. అంతకు ముందు రోజు టీడీపీ అధినేత చంద్రబాబుతో సమావేశమైన వంశీ ప్రస్తుత పరిస్థితుల్లో టీడీపీలో ఉండలేనని కూడా చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో చంద్రబాబు నీ ఇష్టం అని ముక్తసరిగా సమాధానం ఇచ్చారని అంటున్నారు.
ఇక పార్టీ మారేందుకు సిద్ధమైన వంశీ ఈ నెల ఆఖరున వైసీపీ తీర్ధం పుచ్చుకునే అవకాశం కనిపిస్తోంది. తన పార్టీ మార్పు వార్తలు జోరుగా వస్తుండడంతో పార్టీ మార్పుపై వల్లభనేని వంశీ ఎట్టకేలకు స్పందించారు.. దీపావళి తరువాత పార్టీ మార్పు గురించి చెబుతానన్నారు. తాను 2006లో రాజకీయాల్లోకి వచ్చానని అప్పటినుంచి టీడీపీలోనే ఉన్నానని గుర్తుచేశారు. గత 4 నెలలు నుంచి తన నియోజకవర్గంలో అభివృద్ధి కుంటుబడిందని అన్నారు.
ఇక ఇటీవల తనపై అక్రమ కేసు పెట్టారని.. ఈ విషయాలన్నీ సీఎం జగన్‌కు చెప్పానని, ఆయన సానుకూలంగా స్పందించారని వంశీ తెలిపారు. మరి పార్టీ మారేందుకు రెడీ అయిన వంశీ జగన్ కండీషన్ల నేపథ్యంలో తన ఎమ్మెల్యే పదవికి సైతం రాజీనామా చేయాల్సి ఉంటుంది. వంశీ మళ్లీ వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తాడా ? లేదా మరో టాక్ ప్రకారం జగన్ వంశీని రాజ్యసభకు పంపితే.. గన్నవరం నుంచి ప్రస్తుత వైసీపీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా ? అన్నది చూడాలి.