వైసీపీ నేతలే గంజాయి, సారా అమ్ముతున్నారు : వంగలపూడి అనిత

వైసీపీ నాయకులు, వాలేంటీర్లు గంజాయి,నాటుసారా అమ్మకాలు చేస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత. మద్య పానం నియంత్రణ కోసం రెండున్నరేళ్లలో ఏమి చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం లో మద్యం మత్తులో జరిగే మరణాలు అన్నీ ప్రభుత్వ హత్యలేనని నిప్పులు చెరిగారు.

ప్రభుత్వ వైన్ షాపుల్లో దొరుకుతున్న చీప్ లిక్కర్ రెండేళ్లు తాగితే ప్రాణాలు పోతున్నాయని.. మూడు దశల్లో మద్యపాన నియంత్రణ చేస్తామని ప్రగల్భాలు పలికిన ముఖ్యమంత్రి ఎందుకు మడమ తిప్పారని మండిపడ్డారు. ఆడవాళ్ళ తాళిబొట్లు తెగిపోతున్నా ప్రభుత్వంకు పట్టడం లేదు…పొరుగు రాష్ట్రాల్లో మద్యం ధరలతో పోల్చుకుంటున్న ప్రభుత్వం….అభివృద్ధి విషయంలో ఆ పోటీ ఏ మైందని నిలదీశారు. ఐ.ఏ.ఎస్. అధికారులు మద్యం అమ్మకాలు పెంచడంపై రివ్యూ చేయడం దురదృష్టకరమని.. వైన్ షాపుల దగ్గర ఆన్ లైన్ పేమెంట్ విధానం అమలులోకి రావడం లేదని వెల్లడించారు. గల్లా పెట్టెలు నింపు కోవడానికే వైన్ షాపుల దగ్గర డిజిటల్ పేమెంట్స్ పెట్టడం లేదని ఫైర్ అయ్యారు.