తమ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు లేకుంటే మంత్రి రోజాకు రాజకీయాల్లో అడ్రస్ కూడా లేదని తెలుగు మహిళా అధ్యక్షురాలు వంగలపూడి అనిత అన్నారు. శుక్రవారం బెజవాడ దుర్గమ్మను దర్శించుకున్న అనంతరం ఆమె మాట్లాడుతూ… చంద్రబాబు లేకుంటే రోజా ఈ పాటికి ఎక్కడ ఉండేదో కూడా అర్థం కాకపోయేదన్నారు. రాజకీయాల్లో ఓనమాలు దిద్దించిన వ్యక్తి ఒకరు, సినిమా జీవితం ఇచ్చిన వ్యక్తి ఒకరు అలాంటి వారి గురించి ఇష్టారీతిన మాట్లాడే రోజాకు సభ్యత, సంస్కారం ఉన్నాయా? అని ప్రశ్నించారు. మీకు ప్రజల్లోకి రావడానికి ధైర్యం లేదని, పోలీసులను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నారని రోజాపై నిప్పులు చెరిగారు. వైసీపీ పరిస్థితి బురదలో దొర్లిన పంది మాదిరిగా ఉందన్నారు.
ప్రజాగ్రహం పెల్లుబుకి, 70 లక్షల మంది టీడీపీ కార్యకర్తలు రోడ్లపైకి వస్తే ఈ పోలీస్ వ్యవస్థ ఏం చేయగలదని వంగలపూడి అనిత ప్రశ్నించారు. వైసీపీ ప్లెక్సీలకు పోలీసులు కాపలా ఉన్నప్పుడే ఎంత దిగజారిపోయారో అర్థమైందన్నారు. 16 నెలలు జైల్లో ఉండివచ్చి, బెయిల్‌పై రాష్ట్రాన్ని పాలిస్తూ, 38 కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డి అమూల్ బేబీనా?… ఏ తప్పూ చేయని చంద్రబాబు ఆర్థిక ఉగ్రవాదా?.. భారతిరెడ్డి కి ఢిల్లీ కోర్టు నోటీసులు పంపితే మంత్రి రోజా సంబరాలు చేయదేం? అని ప్రశ్నించారు. పోలీసులు లేకుండా బయటకు వస్తే మహిళా మంత్రికి టీడీపీ చేపట్టింది బందో… బొందో బాగా తెలిసేదని అనిత అన్నారు.