మరోసారి సీఎం జగన్‌పై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. దళితులపై జగన్ తన భస్మాసుర హస్తం వేస్తున్నారన్నారు. దళితులను జగన్ అధః పాతాళానికి తొక్కేస్తున్నారని, వైసీపీ ఓ రాజకీయ పార్టీనేనా..? అని ఆయన ప్రశ్నించారు. జగన్ మనువాది అని, దళితులు గొడవ చేస్తే అనంతబాబును సస్పెండ్ చేశారన్నారు. సస్పెండ్ చేసిన అనంతబాబును జగన్ తన పక్కన చేర్చుకున్నారని, సామర్లకోటలో అనంతబాబును పక్కన కూర్చొబెట్టుకున్నారన్నారు. దళితుల కంటితుడుపు కోసం అనంతబాబును సస్పెండ్ చేసినట్టు నటించారని ఆయన మండిపడ్డారు. సస్పెండ్ చేసిన అనంత బాబు ఇంట్లో కూర్చొకుండా.. సీఎం జగన్ పక్కన ఎలా కూర్చొబెట్టుకుంటారు..? దళిత డాక్టర్ సుధాకర్ ప్రశ్నిస్తే చచ్చేలా చేశారన్నారు.
అంతేకాకుండా.. ‘దళితులు మమ్మల్ని ప్రశ్నించడమేంటనే ఉద్దేశ్యంతో దళిత డాక్టర్ చనిపోయేలా చేశారు. ఇసుక అక్రమాలను ప్రశ్నించిన వరప్రసాద్ అనే దళిత యువకుడికి శిరో ముండనం చేస్తారా..? ప్రశ్నిస్తే చంపేస్తారా..? గుండు గీకేస్తారా..? దళిత యువతిని మానభంగం చేసి పోలీస్ స్టేషన్ ముందు పడేస్తే.. ఇప్పటి వరకు చర్యల్లేవ్. పులివెందుల్లో దళిత మహిళ పశువుల కాయడానికి వెళ్తే మానభంగం చేశారు. దళితులంటే ఈ ప్రభుత్వంలో ఆట బొమ్మలా..? కీలు బొమ్మలా..? ఈ ప్రభుత్వం దిగిపోయేంత వరకు దళితులు పక్క రాష్ట్రాలకు వెళ్లిపోవాలా..? దళితుడు.. ఉన్నతాధికారి అయిన డాక్టర్ అచ్చెన్నను చంపేశారు. అందుకే మనువాదం అనే పదాన్ని వాడుతున్నాను. ఎస్సీలపై దాడులు జరుగుతోన్నా పోలీసులు చచ్చు పీనుగుల్లా మారారు. ప్రస్తుత డీజీపీ కసిరెడ్డి వచ్చాక పోలీసింగ్ మరింత దారుణంగా తయారైంది. జగన్ దళిత వ్యతిరేకి. దళితుల అభ్యున్నతి చూస్తే జగన్ కన్ను కుడుతుంది. కెబినెట్లోని దళిత మంత్రులు స్వేచ్ఛగా జగన్ వద్దకెళ్లగలరా..? మేం మా అధినేత చంద్రబాబు వద్దకు స్వేచ్ఛగా వెళ్లగలం.. విధాన నిర్ణయాలపై మాట్లాడగలం. జగన్ ఇంటిలోని లిఫ్ట్ నుంచి ఓ మంత్రిని లాగి పడేశారు.’ అని వర్ల రామయ్య అన్నారు.