వైసీపీ ప్రభుత్వంపై మరోసారి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య విమర్శలు గుప్పించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ల రామయ్య మాట్లాడుతూ… ఏపీలో దళితులపై దాడులు జరుగుతున్నా.. ఏనాడు డీజీపీ, పోలీసు అధికారులు, కలెక్టర్లను గట్టిగా ప్రశ్నించనందున సీఎంనే అనుమానించాల్సి వస్తోందని వర్ల రామయ్య తన అనుమానాన్ని వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని ఓ చిన్న గ్రామంలో దళిత మహిళపై ఐదుగురు వైసీపీ నాయకులు చేసిన గ్యాంగ్ రేప్ విషయంలో సీఎం సిగ్గుతో తలదించుకుంటారా? లేక చర్యలు తీసుకుంటారా? అని వర్ల రామయ్య ప్రశ్నించారు.
ఏడాది క్రితం వైసీపీకి చెందిన ఐదుగురు ఆ దళిత మహిళను భయపెడుతూ సామూహిక అత్యాచారం చేస్తూ వస్తున్నారు అని ఆరోపించారు. అత్యాచారం చేస్తుండగా ఇంకొకడు ఫొటోలు తీస్తాడట. ఇదెక్కడి చోద్యం? అవసరమొచ్చినప్పుడల్లా, అవకాశమొచ్చినప్పుడల్లా ఆ మృగాళ్లు ఆ దళిత మహిళపై అత్యాచారం చేస్తూ వస్తున్నారు. వైసీపీ వలంటీర్ సోదరుడు ఉమెన్ మినిష్టర్ ఉషకి అత్యంత సన్నిహితుడైన హరి అనే వ్యక్తి కూడా ఇందులో భాగస్వామి అని తెలుస్తోంది అని వర్ల రామయ్య ఆరోపించారు.