కొడాలి నాని మూడు ముళ్లు ఎందుకు వేశాడు…ఏ యాక్ట్ ప్రకారం వేశాడు..? అని ఏపీ రాష్ట్ర బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ ఛైర్మన్ వేమూరి ఆనంద్ సూర్య ప్రశ్నించారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నదా లేదా అనే అనుమానం కలుగుతోందన్న ఆయన 7 నెలలుగా హిందూమతంపై దాడులుజరుగుతున్నా, మంత్రులు పిచ్చి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నా ముఖ్యమంత్రి ఎందుకు కట్డడి చేయడం లేదు? అని ప్రశ్నించారు. పాలకులు ఏమతం వారైనా హిందూమతంపై జరుగుతున్న దాడులను అరికట్టకపోతే ఎలా? అని ఆయన ప్రశ్నించారు. ఎవరు చెప్పారని నిన్న జగన్ తిరుమలలో మూడు నామాలు పెట్టుకున్నాడని అని ఆయన ప్రశ్నించారు.
1890లో విలియం కేన్స్ అనే బ్రిటీష్ రాజకీయ వేత్త అన్యమతస్తులు దిగువతిరుపతిలో మేజిస్ట్రేట్ అనుమతి తీసుకున్నాకే, ఎగువ తిరుపతి వెళ్లాలని తన పుస్తకంలో రాసిన విషయాన్ని కొడాలి నాని తెలుసుకుంటే మంచిదని అన్నారు. పింక్ డైమండ్ పై రాజకీయాలు చేసిన రమణ దీక్షితులు, హిందూ మతంతో ఆటలొద్దని ఇప్పుడెందుకు జగన్ కు చెప్పడం లేదు ? అని ఆయన ప్రశ్నించారు. 150 సీట్లున్నాయన్న అహంకారంతో పాలకులు ప్రజాపాలనకు బదులు ఫ్యాక్షన్ పాలన చేస్తున్నారని ఆయన అన్నారు. మంత్రులు వెల్లంపల్లి, కొడాలినాని హిందూమతంతో రాజకీయాలు చేయడం మానేసి, ప్రజాసమస్యలపై ప్రభుత్వంతో కొట్లాడితే ప్రజలు హర్షిస్తారని అన్నారు. రామజన్మభూమి కార్యక్రమంలో మోదీ పక్కనున్న దంపతులే శంఖుస్థాపన చేశారని నానీ తెలుసుకోవాలని ఆయన అన్నారు.