
రాజ్యసభలో సభ జరుగుతున్న తీరుపై ఎంపీలపై రాజ్యసభ చైర్మన్, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సమావేశాలను లైవ్ చూస్తున్న ప్రజలు, సభ్యుల ప్రవర్తన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ఉభయసభలు పలు అంశాలపై చర్చలు జరగకుండా వాయిదాలు పడుతుండటంపై ఆయన స్పందించారు. రానున్న ఐదు రోజుల్లో శీతాకాల సమావేశాలు ముగియబోతున్నాయి, కనీసం ఏ ఒక్క అంశంపై కూడా సరైన చర్చ జరగలేదన్నారు.
ఇప్పటికైనా… దయచేసి సభ సజావుగా జరిగేందుకు సహకరించండి. ‘తలాక్, రఫేల్ ఒప్పందం వంటి కీలక అంశాల గురించి చర్చ జరగాల్సి ఉంది. కొన్ని తీర్మానాలను ఆమోదించేందుకు దయచేసి సహకరించండి’ అంటూ వెంకయ్యనాయుడు సభ్యులనుద్దేశించి అన్నారు. కావేరీ జలాల అంశం, రఫేల్ ఒప్పందాల గురించి కాంగ్రెస్, అన్నాడీఎంకే ఎంపీలు ఆందోళన చేయడంతో రాజ్యసభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. ఆందోళనలు చేయడం ప్రతి ఒక్క సభ్యుడు హక్కు కానీ …కనీసం చర్చకు అవకాశం కల్పించండి అంటూ ఆయన కోరారు.