కేసీఆర్ లాంటివారు చాలా అరుదు… కేటీఆర్

గతంలో ఎన్నో ఉద్యమాలు చేసినప్పటికీ తెలంగాణ రాష్ట్ర సాధన అనేది తెరాస అధినేత కేసీఆర్ అధ్యక్షతనే సాధ్యమైందని తెరాస వర్కింగ్ ప్రెసెడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణలో తెరాస ఆవశ్యకతను ఓటు ద్వారా తెలియజేసిన ప్రజలు మరోసారి లోక్‌సభ ఎన్నికల్లో 16 స్థానాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులను గెలిపిస్తే ఢిల్లీలో నిర్ణయాత్మక పాత్ర పోషించే అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన సనత్‌నగర్లో నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన  తెరాస నేతల సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ… కేసీఆర్ రెండోసారి సీఎం కావడం దేశ చరిత్రలో రికార్డు అన్నారు.

కేసీఆర్ అరుదైన నాయకుడు, ఆయన వ్యవహార శైలి, వ్యూహాలను ఎవ్వరు అందుకోలేరన్నారు. దేశ ప్రధాని మోదీ, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం చేసినా ప్రజలు నమ్మలేదన్నారు. 75శాతం సీట్లు కట్టబెట్టి అఖండమైన విజయాన్ని అందించిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాటి  ‘ఉద్యమ స్ఫూర్తితో ఓటర్ నమోదు కార్యక్రమం నిర్వహించాలని కోరారు. తెలంగాణలో తెదేపా ఇప్పటికే ఖాళీ అయ్యింది. మరోవైపు దేశవ్యాప్తంగా భాజపా ప్రజల విశ్వాసాన్ని కోల్పోతుంది అంటూ విమర్శించారు. కష్ట పడి పనిచేసే వారికి పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామన్నారు.