వచ్చే మూడు నెలల్లో రిటైర్ కాబోతోన్న రాజ్యసభ ఎంపీలకు రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు వీడ్కోలు విందు ఇవ్వనున్నారు. మొత్తం 72 మంది ఎంపీలను ఫేర్వెల్ పార్టీకి ఆహ్మానించారు. దీంతో గురువారం సభలో జీరో అవర్ లేదా ప్రశ్నోత్తరాల సమయం ఉండదని భారత ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ ఎం వెంకయ్య నాయుడు ప్రకటించారు. వెంకయ్య నాయుడు నివాసంలో ఈ వీడ్కోలు కార్యక్రమం జరగనుంది. ఈ విందుకు వెంకయ్య నాయుడుతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేతలు కూడా హాజరుకాబోతున్నారు. ఈ సందర్భంగా వారు ప్రసంగించనున్నారు. పదవీ విమరణ చేస్తున్న 72 మంది ఎంపీలతో పాటు ఇప్పటికే పదవీ విరమణ చేసిన 19 మంది సభ్యులకు జ్ఞాపికలను అందచేయనున్నారు.ప్రస్తుతం రిటైర్ కాబోతోన్న 72 మంది ఎంపీల్లో 30 మంది బీజేపీ నుంచి 13 మంది కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. బీజేడీ, డీఎంకే, ఏఐఏడీఎంకే, అకాలీదళ్ నుంచి ముగ్గురు చొప్పున, సీపీఐ(ఎం), టీఆర్‌ఎస్, బీఎస్పీ, సమాజ్‌వాదీ నుంచి ఇద్దరు చొప్పున ఎల్‌జెడి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, ఎన్‌సిపి మరియు శివసేన నుండి ఒక్కొక్కరు రిటైర్ కానున్నారు.