ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి అతి తక్కువ సమయంలోనే యూత్‌లో తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు హీరో విజయ్ దేవరకొండ. నువ్విలా, లైఫ్ఈజ్ బ్యూటిఫుల్, ఎవడే సుబ్రమణ్యం సినిమాల్లో నటించి మెప్పించాడు. ఆతర్వాత ‘పెళ్లి చూపులు’ తో హీరోగా ఎంట్రి ఇచ్చి సూపర్ హిట్ అందుకున్నాడు రౌడి బాయ్. ఆ తర్వాత ‘అర్జున్ రెడ్డి’ మరియు ‘గీత గోవిందం’ వంటి భారీ హిట్స్ కొట్టి విపరీతమైన క్రేజ్‌ని సొంతం చేసుకున్నాడు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ చేసిన ఓ పనికి టిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. లైగర్ తీసుకున్న నిర్ణయాన్ని అందరూ స్వాగతిస్తున్నారు. భారీగా స్పందన లభిస్తోంది. అసలు అతను ఏం చేశాడంటే…ఈ రౌడి బాయ్ సినిమాలతో వినోదాన్ని పంచడమే కాదు.. సామాజిక సేవలో కూడా ఎప్పుడూ ముందుంటాడని తెలిసిందే. బాలల దినోత్సవం సందర్భంగా విజయ్‌దేవరకొండ తీసుకున్న నిర్ణయం ఎంతోమందిలో స్ఫూర్తి నింపుతోంది.
కాలేయ సంబంధ వ్యాధులతో బాధపడుతున్న చిన్నారుల కోసం లివర్ పాంక్రియాస్ ఫౌండేషన్ ఆఫ్ హైదరాబాద్, PACE హాస్పిటల్స్‌తో కలిసి ఏర్పాటు చేసిన పీరియాట్రిక్ లివర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అవగాహన కార్యక్రమానికి విజయ్‌దేవరకొండ ముఖ్యఅతిథిగా హాజరయ్యాడు. ఈ సందర్భంగా విజయ్‌దేవరకొండ మాట్లాడుతూ.. తన అవయవాలను దానం చేసినట్లు తెలిపాడు. తన మరణానంతరం తాను వేరొకరి జీవితంలో భాగం అయ్యేందుకు ఇష్టపడతానన్నాడు.
తన అవయవాలను వృథా చేయడంలో ఎలాంటి ఉపయోగం కూడా లేదన్నాడు. ఇంకొకరి జీవితాన్ని నిలబెట్టాలనే సంకల్పంతో విజయ్ తీసుకున్న ఆర్గాన్ డొనేషన్ నిర్ణయం పట్ల నెటిజన్లు, అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ ఏడాది పాన్ ఇండియా చిత్రం లైగర్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా.. ఊహించని విధంగా డిజాస్టర్ టాక్ మూటగట్టుకుంది. ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో ఖుషీ సినిమాలో నటిస్తున్నాడు. సమంత ఫీ మేల్ లీడ్ రోల్ పోషిస్తోంది.