కేసీఆర్ సర్కార్ ప్రవేశపెట్టిన ధరణి రైతులకు బాధలను, దళారులకు డబ్బులను తెచ్చిపెడుతుంది. ధరణిలో ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉన్న భూములు కాసులు కురిపిస్తున్నాయన్నారు విజయశాంతి. ధర కోట్ల రూపాయల్లో ఉన్న ప్రాంతాల్లో ఎకరానికి ఇంత అని రేటు ఫిక్స్చేసి నిషేధిత జాబితా నుంచి ఆ భూములను తీసేస్తున్నారని పేర్కొన్నారు.
అదీ ప్రభుత్వ భూమి, అటవీ, వక్ఫ్, దేవాదాయ, అసైన్డ్ ల్యాండ్ అయినా సరే పైసలిస్తే చాలు.. పనైపోతుంది. ఇదంతా అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లోనే జరుగుతుంది. ధరణి వచ్చినప్పటి నుంచి అన్ని జిల్లాల్లో ఈ వ్యవహారం గుట్టుగా కొనసాగుతూ వస్తోంది. గత వారం నుంచి ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో ఉన్న భూములపై హైదరాబాద్ సీసీఎల్ఏ ఆఫీసులో స్పెషల్ మీటింగులు పెడుతూ ఆ లిస్ట్‌లో నుంచి కొన్నింటిని తీసేస్తున్నారన్నారు.
ఇదే అదునుగా అర్హతలేని వాటిని కూడా ఈ జాబితాలో నుంచి తొలగించారు. ఈ క్రమంలో కోట్ల రూపాయల అవినీతి జరుగుతోంది. ప్రొహిబిటెడ్ లిస్టులో ఉన్న సర్వే ననంబర్ తొలగించుకునేందుకు ఎకరాకు రూ.లక్ష నుంచి రూ. కోటి దాకా కూడా పెడుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఎకరం ధర రూ.5 కోట్లు ఉండగా.. ఆ సర్వే నంబర్ ప్రొహిబిటెడ్ జాబితాలో ఉంటే దానిని తీయించుకునేందుకు రూ.50 లక్షల నుంచి రూ.కోటి దాకా ముడుపులు తీసుకుంటున్నారు. ఇలా అన్నదాతలను ఆగం చేస్తున్న కేసీఆర్ సర్కార్ కు తెలంగాణ రైతాంగమే తగిన శాస్తి చేస్తుందని పేర్కొన్నారు విజయశాంతి.