వైసీపీలో సాయిరెడ్డి టార్గెట్‌… ఆడియో హ‌ల్‌చ‌ల్‌…!

-

వైసీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, గ‌త ఎన్నిక‌ల్లో పార్టీని ఒంటి చేత్తో న‌డిపించిన నాయ‌కుడు, ఎంపీ విజ‌య‌సాయి రెడ్డికి, వైసీపీ సీనియ‌ర్ నాయ‌కుల‌కు మ‌ధ్య ప‌చ్చ‌గ‌డ్డి వేసినా భ‌గ్గున మండుతోంది. దీనిని పైకి ఒప్పుకునేంత సాహ‌సం ఏ వైసీపీ నాయ‌కుడు కూడా చేయ‌క‌పోయినా అంత‌ర్గ‌తంగా మాత్రం సాయిరెడ్డి విష‌యంలో కొంద‌రు ర‌గులుతున్నార‌ట‌. ఆయ‌న విశాఖ‌ను ఆక్ర‌మించార‌ని కొంద‌రు నాయ‌కులు బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేస్తుంటే.. విశాఖ నాయ‌కులు ఏకంగా ఆయ‌న ఎదురుతిరిగారు. అయితే.. ఈ పంచాయ‌తీలో ఏకంగా సీఎం జ‌గ‌న్ జోక్యం చేసుకుని స‌ర్ది చెప్పారు. దీంతో వివాదాలు స‌ర్దు మ‌ణిగిన‌ట్టే క‌నిపించాయి.కానీ, విశాఖ నేత‌లు మాత్రం ఇప్ప‌టికి సాయిరెడ్డిని ప‌క్క‌న పెట్టేస్తున్నారు. గ‌త కొన్నాళ్లుగా టీడీపీకి చెందిన నేత‌ల కార్యాయాలు,ఇళ్ల‌ను విశాఖ మునిసిప‌ల్ అధికారులు కూల‌గొడుతున్నారు.

వారు ఆక్ర‌మ‌ణ‌ల‌కు పాల్ప‌డ్డారు. నోటీసులు ఇచ్చినా స్పందిచండం లేదు అందుకే కూల‌గొడుతున్నాం .. అంటూ.. అధికారులు చెబుతున్నారు. ఇక‌, శుక్ర‌వారం వ‌చ్చిందంటే చాలు జిల్లాలో ఎవ‌రి ఇళ్లు కూలిపోతాయో.. అంటూ.. టీడీపీ నేత‌లు ఆందోళ‌న‌ల‌ను దిగుతున్నారు. కంటిపై కునుకు లేకుండా ప‌హారా కాస్తున్నారు. అయితే.. ఈ ప‌రిణామం.. వైసీపీ నేత‌ల‌కు న‌చ్చ‌డం లేదు. ముఖ్యంగా విశాఖ‌కు చెందిన వైసీపీ నాయ‌కులు ఈ చ‌ర్య‌లపై తీవ్ర ఆగ్ర‌హంతో ఉన్నారు. ఆక్ర‌మించుకున్న వారు నిజంగా ఉంటే.. చ‌ట్టప‌రంగా చ‌ర్య‌లు తీసుకునేలా వారికి త‌గిన వ్య‌వ‌ధి ఇవ్వాల‌ని.. కానీ, ఇలా అర్ధ‌రాత్రి కూల‌గొట్ట‌గ‌డం వెనుక సాయిరెడ్డి వ్యూహం ఉంద‌ని బ‌హిరంగ విమ‌ర్శ‌లు చేస్తున్నారు.

అంతేకాదు.. ఇలా అయితే..తాము మ‌ళ్లీ గెలుపు గుర్రాలు ఎక్క‌లేమ‌ని చెబుతున్నారు. ఈ క్ర‌మంలో విశాఖ‌కు చెందిన వైసీపీ నాయ‌కుడు కీల‌క ప‌ద‌విలో ఉన్న ఒక‌రు.. మాట్లాడిన ఆడియో.. హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. దీనిలో ఆయ‌న సాయిరెడ్డిపై విరుచుకుప‌డ్డారు. ఆయ‌న ఇప్పుడుంటారు.. పోతారు. మేం ప్ర‌జ‌ల్లో ఎలా త‌లెత్తుకు తిర‌గాలి. రేపు ఎన్నిక‌లు వ‌స్తే.. ఆయ‌న కార్యాల‌యానికి ప‌రిమిత‌మ‌వుతారు. ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల్సింది మేం. ఓట్లు అడ‌గాల్సింది మేం. ఆయ‌న రాజ్య‌స‌భ స‌భ్యుడు. ఇది కాదంటే వేరే ప‌ద‌వులు కూడా ఉన్నాయి. మాకు ప్ర‌జ‌లే కావాలి. ఆయ‌న ఆలోచించ‌కుండా చేస్తున్న ప‌ని మా రాజ‌కీయాల‌పై ప్ర‌భావం చూపిస్తోంది. అని నిప్పులు చెరిగారు. దీంతో సాయిరెడ్డి స‌ర్ది చెప్పేందుకు చేస్తున్న ప్ర‌య‌త్నాలు ఏమాత్రం ప‌నిచేయ‌డం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఇది మ‌రింత వివాదం గా మారే అవ‌కాశం ఉంటుంద‌ని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news