కేసీఆర్ హుజూర్‌నగర్ పర్యటన రద్దుపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన విజయశాంతి..

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హుజూర్‌న‌గ‌ర్ ప‌ర్య‌ట‌న నిన్న జ‌ర‌గాల్సి ఉంది. కానీ వాతావరణం అనుకూలించక‌పోవ‌డంతో ప‌ర్య‌ట‌న వాయిదా ప‌డింది. అయితే ఈ ప‌ర్య‌ట‌న వాయిదా వేసుకోవడం వెనక అసలు మతలబు వేరే ఉందని తెలంగాణ కాంగ్రెస్ ప్రచార కమిటీ చైర్‌పర్సన్ విజయశాంతి చెప్పారు. సీఎం హుజూర్‌నగర్‌లో పర్యటించాలని నిజంగానే అనుకుంటే రోడ్డు మార్గం ద్వారా కూడా వెళ్లొచ్చని, కానీ హెలికాప్టర్ ద్వారా వెళ్లాలనుకోవడం వెనక అసలు మతలబు వేరే ఉందని అన్నారు.

ఆర్టీసీ సమ్మె కారణంగానే కేసీఆర్ తన పర్యటనను రద్దు చేసుకున్నారని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల నుంచి సభలో తనకు చేదు అనుభవం ఎదురయ్యే అవకాశం ఉందని ముందే గ్రహించి ఆయన తన పర్యటనను రద్దు చేసుకున్నారని విజయశాంతి విమర్శించారు. నిరసనల సెగ భయంతోనే 200 కిలోమీటర్ల దూరంలో ఉన్న హుజూర్‌నగర్‌కు రోడ్డు మార్గంలో వెళ్లలేకపోయారని అన్నారు. ఎన్నికల ప్రచారాన్ని రద్దు చేసుకున్న కేసీఆర్ పరోక్షంగా తన ఓటమిని అంగీకరించారని విజయశాంతి ఎద్దేవా చేశారు.