తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ చాపకింద నీరులా విస్తరించుకుంటూ పోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక పార్టీలకు చెందిన నేతలు ఇప్పుడు ఒక్కొక్కరు బీజేపీలోకి క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కీలక నేతగా ఉన్న, మాజీ ఎంపీ, సినీ నటి విజయశాంతి కూడా ఇప్పుడు బీజేపీలోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. విజయశాంతి కొంత కాలం నుంచి కాంగ్రెస్‌కు దూరంగా ఉంటూ వస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలో ఆమెను కనీసం పట్టించుకున్న పరిస్థితి కూడా లేదు.
ఇక విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం విజయశాంతి బీజేపీలో చేరేందుకు ముహూర్తం చూసుకున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఉమ్మడి మెదక్ జిల్లాలో ఆమె గతంలో మెదక్ ఎంపీగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్‌లోకి వచ్చి ఎన్నికల్లో పోటీ చేసినా ఆమె విజయం సాధించలేదు. ఇక ఇటీవల ఆమె దుబ్బాక ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారన్న ప్రచారం జరిగినా కూడా ఆమె అందుకు ఆసక్తి చూపలేదు. ఇక విజయశాంతి రెండు రోజులుగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డితో హైదరాబాద్‌లో చర్చలు జరుపుతున్నారు.
సోమవారం వీరిద్దరి మధ్య గంటపాటు చర్చ జరిగింది. దీంతో విజయశాంతి పార్టీ మార్పు ఖాయమైందని.. దసరాకు ముహూర్తమే ఉంటుందని తెలంగాణ రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. గతంలో ఆమె తెలంగాణ బీజేపీలో చాలా చురుకైన పాత్ర పోషించారు. ఆమెకు కేంద్రంలో బీజేపీ అగ్ర నేతలతో కూడా మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఆ తర్వాత ఆమె తల్లి తెలంగాణ పార్టీ స్థాపించడం, ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేయడం జరిగింది.
చివరకు తన పార్టీని టీఆర్ఎస్ లో విలీనం చేసి… 2009లో మెదక్ నుండి టీఆర్ఎస్ ఎంపీగా గెలుపొందారు. ఆ తర్వాత టీఆర్ఎస్ కు దూరమై కాంగ్రెస్ గూటికి చేరారు. ఆమె కాంగ్రెస్ నుంచి మెదక్ ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు. అనంతరం ఆమె కాంగ్రెస్‌కు దూరమవుతూ వస్తున్నారు. ఇక ఇప్పుడు మళ్లీ ఆమె బీజేపీలో చేరడం ద్వారానే రాజకీయంగా భవిష్యత్తు ఉంటుందన్న నిర్ణయంతోనే ఆ దిశగా అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది.