BRS పెట్టి తెలంగాణ పేరును అవమానించాడని ఫైర్ అయ్యారు విజయశాంతి. మొన్నటి వరకూ టీఆరెస్‌గా ఉండి నిన్న భారత రాష్ట్ర సమితిగా అంటే, భారాసగా మారిన ఈ పార్టీ వల్ల దేశానికి మరింత భారం తప్ప మరొకటి కాదు. ఈ పేరు మార్పు అన్నది ఏదో గొప్ప ఘనకార్యంలాగా… అప్పుడే జాతీయ పార్టీ అయిపోయినట్టు కేసీఆర్ గారు చేస్తున్న హడావుడి చూస్తుంటే బొమ్మల పెళ్లి చేసి ఉత్తుత్తి భోజనాలతో సంబరపడే పిల్లలాట గుర్తుకొస్తోందని చురకలు అంటించారు.
గత ఎనిమిదేళ్ళ పాలనలో రాష్ట్రాన్ని దారుణంగా అప్పుల పాలు చేసి ఇప్పుడు దేశాన్ని ఉద్ధరిస్తానంటూ బయల్దేరడం హాస్యాస్పదం. సాగు సమస్యలతో రైతులు, ఉద్యోగాల్లేక నిరుద్యోగులు, డబుల్ బెడ్రూముల కోసం పేదలు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఏమీ పాలుపోక… తెలంగాణ ప్రజలకు ముఖం చూపించలేక బీఆరెస్ అంటూ కొత్త డ్రామాకు తెరలేపారని కేసిఆర్ పై మండిపడ్డారు .
తెలంగాణ పేరు వింటేనే ఆయనకు ఆ అప్పులు, ఆత్మహత్యలే గుర్తుకొస్తుండటంతో చివరికేం చెయ్యాలో తెలియక పార్టీ పేరు నుంచే తెలంగాణ అన్న పదాన్ని తొలగించినట్టు అర్ధమవుతోంది. అదే తీరున రాష్ట్ర ప్రజలు కూడా గులాబీ దళాన్ని అధికారం నుంచి తొలగించడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన గుర్తెరగాలన్నారు విజయశాంతి.