కేసీఆర్ సర్కార్ను బంగాళఖాతంలో కలపడం ఖాయమని విజయశాంతి వార్నింగ్ ఇచ్చారు. కేసీఆర్ ఇచ్చే హామీలు ఆకాశానికి నిచ్చెన వేసినట్టే ఉంటాయి. సీఎం సారు చెప్పే మాటలు బారెడు… చేసే పనులు మూరెడంటూ చురకలు అంటించారు. దొరగారు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నీటిమూటల్లాగే మిగిలిపోతున్నాయి. ఇప్పుడు ఓరుగల్లు బిడ్డలు రోడ్డెక్కి ధర్నా చేస్తున్నారని… అందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కట్టించి, గుడిసెలు లేని వరంగల్ చేస్తమని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చి ఏడేండ్లయితున్నా అమలుకాకపోవడంతో గ్రేటర్ వరంగల్లో పేదలు రోడ్డెక్కుతున్నారని తెలిపారు.
కిరాయి ఇండ్లకు నెలనెలా వేలల్లో ఇంటి కిరాయిలు కట్టే స్థోమత లేక… కేసీఆర్ సర్కారుతో తాడో పేడో తేల్చుకుందమని పోరుబాట పడుతున్నారని… ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు వేసుకుంటున్నారన్నారు. వీటిని రెవెన్యూ, పోలీస్ అధికారులు జేసీబీలు పెట్టి కూల్చేస్తున్నరు. కొన్నిచోట్ల అగ్గిపెడుతుంటే పేదలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని…వెల్లడించారు.
తమకు ఇల్లు కట్టిస్తమని చెప్పి కట్టియ్యకపోగా… తాము వేసుకుంటున్న గుడిసెలను తొలగించుడేందని ప్రశ్నిస్తున్నారని… బడాబాబులు వేల ఎకరాల ప్రభుత్వ భూములు కబ్జా చేసినా పట్టించుకోని అధికారులు… గరీబోళ్ల మీద పగబట్టినట్లు చేసుడేందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. రెండు వారాలుగా ఏదో ఒక రూపంలో నిరసనలు చేస్తున్నారు. వరంగల్ ఒక్క చోటే కాదు. తెలంగాణ మొత్తం ఇదే జరుగుతుందని మండిపడ్డారు విజయశాంతి.