తెలుగు రాష్ట్రాల్లో వినడానికే జుగుప్స కలిగించే దారుణ అత్యాచారాలు గత కొద్ది రోజులుగా మనల్ని కట్టి కుదిపేస్తున్నాయని విజయశాంతి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నీచ కృత్యాలకు పాల్పడినవారిలో కొందరు బయటివారు కాగా… మరికొందరు కుటుంబ సభ్యులే కావడం పరమ హేయమని.. కామంతో కళ్లు మూసుకుపోయిన ఆ పాపాత్ములకు పసిపిల్లలు, బాలికలు, నడి వయసు మహిళలనే తేడా లేదని ఆగ్రహించారు. ఈ పరిణామాలు కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాకపోవచ్చు, కానీ ఇటీవల ఈ పాపాలు జరిగింది తెలుగు నేలపై కావడంతో సోషల్ మీడియా సహా మన చానెళ్లు, పత్రికలు ఏం చూసినా ఇవే కనిపిస్తూ మనందరినీ నిలదీస్తున్నాయి. ఎవరిది ఈ తప్పు? ప్రతి దానికీ ప్రభుత్వాలని, రాజకీయ నాయకులని మాత్రమే వేలెత్తి చూపడం వల్ల లాభం లేదని విమర్శించారు.
వ్యక్తిగా మనమేం చేస్తున్నాం? ఇంట్లోని ఆడపిల్లకు అండగా నిలిచేలా అబ్బాయిలను మలుచుకుంటున్నామా? ఇటీవలి కాలంలో విద్యార్థి లోకం, యువతరం డ్రగ్స్ గుప్పిట్లో చిక్కుకుని మానసిక దౌర్భల్యాలకు లోనవడం మనం కళ్లారా చూస్తున్నామని పేర్కొన్నారు. హైస్కూలు స్థాయిలో సైతం పిల్లలు మాదకద్రవ్యాల బారిన పడుతుండటం, గంజాయితో పార్టీలు చేసుకోవడం లాంటి ఘటనలు ఈ మధ్య కాలంలోనే కలకలం రేపాయి. ఇవిగాక మరోవైపు బైక్ రేసింగులు, బెట్టింగులు ఉండనే ఉన్నాయని ఫైర్ అయ్యారు.
సిగ్గుపడేలా… తలదించుకునేలా సంచలన ఘటనలు జరిగినప్పుడల్లా కొన్ని రోజుల పాటు ర్యాలీలు, నిరసనలు చేసి ఆయాసంతో ఆగిపోవడం తప్ప… ఒక స్థిర సంకల్పంతో ఎంత మేరకు మనం విమెన్ ఫ్రెండ్లీ సమాజాన్ని నిర్మించుకున్నాం? గుండెల మీద చెయ్యేసి చెప్పండని ప్రశ్నించారు. మన సమాజంలో ఈ తీరు మారే వరకూ స్త్రీల ఉద్ధరణ పేరిట ఎన్ని పథకాలు పెట్టినా… ఒరిగేదేమీ ఉండదని… ఇంట్లో మొదలుపెట్టి స్కూలు, కాలేజీ, ఆఫీస్… ఇలా ప్రతి దశలోనూ స్త్రీని గౌరవప్రదంగా చూసే వాతావరణాన్ని కల్పించాలని డిమాండ్ చేశారు విజయశాంతి. ఈ మేరకు తాను నటించిన ఓ సినిమాలోని వీడియోను షేర్ చేశారు.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) May 3, 2022