దుబ్బాక ఉప ఎన్నికల్లో విక్టరీ కొట్టిన బీజేపీ ఆ వెంటనే గ్రేటర్ ఎన్నికల సమరంలోకి దూకి సత్తా చాటింది. తెలంగాణలో తెరాసకి గట్టి పోటీగా నిలిచింది. ఇక టీఆర్ఎస్ పార్టీ, బీజేపీకి మధ్య మొత్తంగా ఓట్ల వ్యత్యాసం వేల సంఖ్యలోనే ఉందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఇక, ఈ విజయాలపై రాష్ట్ర నేతలను అభినందించారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా. కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో విజయశాంతి భేటీ అయ్యారు. ఢిల్లీలోని ఆయన నివాసంలో కిషన్‌రెడ్డి, బండి సంజయ్ తో వెళ్లి అమిత్ షాను కలిశారు.
అయితే రేపు విజయశాంతి బీజేపీ చేరనున్న సందర్భంగా ఈ భేటీ జరిగింది. ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన బండి సంజయ్.. రేపు ఉదయం 11 గంటలకు విజయశాంతి బీజేపీలో చేరతారని వెల్లడించారు. జీహెచ్‌ఎంసీ ఫలితాల పట్ల తెలంగాణ బీజేపీ నేతలను అమిత్ షా అభినందించారని బండి సంజయ్ తెలిపారు. ఇదే దూకుడును కొనసాగించమని అమిత్ షా సూచించారని ఆయన అన్నారు. ఇక రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీజేపీ ఇదే సామర్థ్యాన్ని కనబర్చాలని షా సూచించారని బండి సంజయ్ వెల్లడించారు.
ఇక టీఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతుందని ప్రకటించిన రాష్ట్ర బీజేపీ చీఫ్ తెలంగాణ అసలైన ఉద్యమకారులను టీఆర్ఎస్ విస్మరిస్తోందని విమర్శించారు. అందుకే ఉద్యమకారులు బీజేపీలో చేరుతున్నారని.. తెలంగాణ ఉద్యమంలో విజయశాంతి కీలకపాత్ర పోషించారని గుర్తు చేశారు. మరోవైపు.. తెలంగాణలో బీజేపీనే ప్రత్యామ్నాయం అన్నారు బండి విజయశాంతి తిరిగి మాతృ సంస్థకు వచ్చారు… చాలా సంతోషంగా ఉందన్న ఆయన మోడీ నాయకత్వంపై విశ్వాసం ఉంచే వారందరినీ స్వాగతిస్తాం.. కానీ, “ఆకర్ష్ ఆపరేషన్” చేయాల్సిన అవసరం మాకు లేదన్నారు. తెరాసను ఎదుర్కొనే ఏకైక పార్టీ బీజేపీయేనని బండి సంజయ్ ప్రకటించారు.