గుంటూరు జిల్లా వినుకొండ నియోజకవర్గంలో వైసీపీ రాజకీయాలు వేడెక్కాయి. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో గత ఏడాది ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బొల్లా బ్రహ్మనాయుడు విజయం సాధించారు. కమ్మ సామాజిక వర్గం ప్రభావం ఎక్కువగా ఉన్న ఈ నియోజకవర్గంలో వారిని తనవైపు తిప్పుకోవడంలో ఎన్నికల ముందు బ్రహ్మనాయుడు విజయం సాధించారు. అదే సమయంలో ఎంత బలంగా ఉన్నా పార్టీ వ్యతిరేక గాలుల నేపథ్యంలో టీడీపీ నాయకుడు, అప్పటి ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ప్రజలకు దూరమయ్యారు. అయితే, ఏడాదిన్నర గడిచే సరికి ఇక్కడ పరిస్థితులు తారుమారవుతున్నాయని వైసీపీలోనే నేతల మధ్య చర్చ సాగుతోంది.
ఓటు బ్యాంకులో కీలకమైన కమ్మ సామాజిక వర్గానికి గత ఎన్నికల సమయంలో బొల్లా బ్రహ్మనాయుడు అనేక హామీలు ఇచ్చారు. తనను గెలిపిస్తే.. స్థానికంగా అభివృద్ధి కార్యక్రమాలు చేపడతానని చెప్పారు. దీంతో ఇక్కడి కమ్మ సామాజిక వర్గం ఆయనపై అచంచెల ఆశలు పెట్టుకుంది. అదే సమయంలో స్థానిక వైసీపీ నాయకులు, కార్యకర్తలకు కూడా అనేక హామీలు ఇచ్చారు. తాను గెలిచిన తర్వాత ఖచ్చితంగా నామినేటెడ్ పదవులు ఇప్పిస్తానని హామీ ఇచ్చారు.
కానీ, ఇప్పటి వరకు వీరి హామీలు నీటి మూటలుగానే మిగిలాయి. పైగా అసలు నియోజకవర్గంలోనే ఉండడం లేదని మరో టాక్ వినిపిస్తోంది.ఎంతసేపూ.. గుంటూరు లేదా నరసారావుపేటకే పరమితమవుతున్నారని సొంత పార్టీ నేతల నుంచే విమర్శలు వస్తున్నాయి. ఇక, ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మార్చుకున్న టీడీపీ నాయకులు ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు ఎమ్మెల్యేపై తిట్ల దండకం అందుకుంటున్నారు. నిత్యం ఆయనే ప్రజల్లో ఉంటున్నారు. ప్రతి ఒక్కరినీ కలుస్తున్నారు. వారి సమస్యలను తాను పరిష్కరిస్తానంటూ హామీల వర్షం కురిపిస్తున్నారు.
ఇది క్షేత్రస్థాయిలో ఎమ్మెల్యే బొల్లాపై తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు పరిశీలకులు. గుంటూరు జిల్లాలో చిత్రం ఏంటంటే.. వైసీపీ ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్న ప్పటికీ.. ప్రజల్లో ఇప్పటికీ టీడీపీ నేతల పేర్లే వినిపిస్తున్నాయి. ఇప్పుడు వినుకొండ కూడా ఈజాబితాలోకి చేరిపోయింది. దీనికి తోడు నరసారావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులతోనూ ఆయనకు పొసగడం లేదు. లావు మాజీ ఎమ్మెల్యే మక్కెనకు ప్రయార్టీ ఇస్తున్నారని బొల్లా రగిలిపోతున్నారు. మరి ఇదే పరిస్థితి మున్ముందు కూడా కొనసాగితే వినుకొండలో వైసీపీ పరిస్థితి దారుణమేనని అంటున్నారు పరిశీలకులు.
-vuyyuru subhash