ఏపార్టీలో అయినా.. కొత్తగా నాయకులకు అధికారం చేతికి వస్తే.. వెంటనే చేసేది ఒక్కటే.. తమదైన మార్కు వేసే ప్రయత్నం. గతంలో ఉన్న నాయకులు ఫెయిల్ అయ్యారని.. తాము తప్ప.. పార్టీని బతికించేవారు.. నడిపించేవారు మరొకరు ఉండరని.. కూడా నాయకులు ప్రచారం చేసుకునేందుకు ప్రయత్నిస్తారు. ఇప్పుడు ఇలాంటి పరిణామమే.. ఏపీ బీజేపీలోనూ చోటు చేసుకుంది. ఏపీ బీజేపీ సారధిగా కొత్తగా ఇటీవల పగ్గాలు చేపట్టిన.. సీనియర్ బీజేపీ నాయకుడు, ఆర్ ఎస్ ఎస్ మూలాలున్న సోము వీర్రాజు.. తనదైన శైలిలో పార్టీలో విజృంభిస్తున్నారు. ఇప్పటి వరకు పార్టీ ఉదాసీనంగా ఉన్న విషయాల్లో ఆయన దూసుకుపోతున్నారు.
రాజధాని విషయంలో స్పష్టమైన వైఖరిని ప్రదర్శించి.. ఓ వర్గం ప్రజలు నొచ్చుకుంటారని తెలిసినా.. పార్టీ ప్రయోజనాలే ముఖ్యమనే రీతిలో ఆయన వ్యవహరించిన తీరుకు.. రాజకీయ వర్గాల్లో మంచి మార్కులు పడ్డాయి. అదే సమయంలో ఇటీవల జరిగిన అంతర్వేది ఘటనను కూడా తనకు అనుకూలంగా మార్చుకుని పార్టీకి మంచి మార్కులు సాధించి పెట్టేందుకు సోము ప్రయత్నించారు. ఇక, ఇప్పుడు తనదైన శైలిలో తీసుకున్న నిర్ణయంతో పార్టీపై మరింత పట్టుకు ఆయన ప్రయత్నించారు. తాజాగా ఏపీ బీజేపీకి కొత్త పదాదికారుల కమిటీని సోము ప్రకటించారు.
40 మందితో కూడిన ఈ కమిటీలో 10 మంది ఉపాధ్యక్షులు, ఐదుగురు ప్రధాన కార్యదర్శులు,10 మంది కార్యదర్శులు, ఆరుగురు అధికార ప్రతినిధులు, ట్రెజరర్, రాష్ట్ర కార్యాలయ కార్యదర్శి ఉన్నారు. అయితే, ఈ విషయంలో సోముచూపించిన చాతుర్యానికి కమలనాథులే ఉలిక్కి పడుతున్నారు. గతంలో అధ్యక్షుడిగా చేసిన కన్నా లక్ష్మీనారాయణ (సొంత సామాజిక వర్గమే అయినప్పటికీ) ముద్రను సోముపూర్తిగా తుడిచి పెట్టేశారు.
తనకు అనుకూలంగా ఉండేవారిని, అదే సమయంలో అధిష్టానంతో దగ్గరగా ఉండే వారికే పెద్దపీట వేశారు. ఇక, జంబో కమిటీగా పేరున్న అధికార ప్రతినిధుల సంఖ్యను ఏకంగా 30 నుంచి 6కు తగ్గించేశారు. ఈ పరిణామంతో సోము వ్యూహం అదిరిపోయిందనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఈ మార్పు.. ఎన్నికలకు వరకు ఉంటుందా? సోము ఆశించిన ఫలితం వస్తుందా? అనేది మాత్రం సస్పెన్స్!!
-vuyyuru subhash