సెలబ్రిటీలకు తమ వృత్తి కంటే ఇతర మార్గాలలో వచ్చే ఆదాయమే ఎక్కువగా ఉంటుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ప్రకటనల ద్వారానే కోట్ల రూపాయాలు ఆర్జిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా పోస్టుల ద్వారా కూడా కోట్లు సంపాదిస్తున్నారు సెలబ్రిటీలు. అయితే ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్ ఫాం అయిన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా చేసే పోస్ట్‌లతో సెలబ్రిటీలు భారీగా సంపాదిస్తున్నారు. తాజాగా ఇన్‌స్టాగ్రామ్ Instagram పోస్టుల ద్వారా ఎక్కువగా సంపాదిస్తున్న వారి జాబితాను హాపర్‌హెచ్‌క్యూ అనే సంస్థ విడుదల చేసింది.
హాపర్‌హెచ్‌క్యూ విడుదల చేసిన 2021 ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్ లో టాప్ 20లో భారత్ తరపున ఒకే ఒక సెలబ్రిటీ చోటు దక్కించుకున్నాడు అతడే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ లిస్ట్‌లో విరాట్ కోహ్లి 19వ స్థానంలో ఉండగా… విరాట్ ఒక్కో పోస్ట్‌కు రూ.5 కోట్లు వసూలు చేస్తాడని హాపర్‌హెచ్‌క్యూ వెల్లడించింది. విరాట్ తర్వాత ఒక్కో పోస్ట్‌కు రూ.3 కోట్లు వసూలు చేస్తున్న ప్రియాంకా చోప్రా 27వ స్థానంలో ఉంది.
ఇక ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్ లో పోర్చుగల్ ఫుట్ బాల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో అగ్ర స్థానంలో నిలిచాడు. రొనాల్డో ఒక్కో పోస్ట్‌కు రూ.11 కోట్లు వసూలు చేస్తాడని హాపర్‌హెచ్‌క్యూ తెలిపింది. రెండో స్థానంలో డబ్ల్యూడబ్ల్యూఈ, హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్సన్ ఉండగా… అతడు కూడా ఒక్కో పోస్ట్‌కు రొనాల్డోతో సమానంగా రూ.11 కోట్లు వసూలు చేస్తాడని ఆ సంస్థ వెల్లడించింది. మొత్తం 395 మంది సెలబ్రిటీలతో హాపర్‌హెచ్‌క్యూ రిచ్ లిస్ట్‌విడుదల చేయగా అందులో ఏ ఇతర ఇండియన్ క్రికెటర్ లేకపోవడం గమనార్హం.