పాలనా రాజధానిగా విశాఖను తీర్చిదిద్దాలని యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అనుకుంటున్నా అవేవీ జరిగేలా లేవు. మరోవైపు ఒకనాటి కన్నా ఇప్పుడు విశాఖ కేంద్రంగా భూ కబ్జా వివాదాలు పెరిగిపోతున్నాయి. ల్యాండ్ సెటిల్మెంట్లలో వైసీపీ నాయకులే ఉంటున్నారని టీడీపీ నేరుగానే ఆరోపణలు చేస్తోంది. ఇందుకు ఆధారాలు కూడా చూపిస్తోంది. అయినా ఎవరేమి అనుకున్నా నాకేంటి అన్న పంథాలో మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులు. తాజా వివాదంలో ఇరుక్కున్న వారు విశాఖ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి. ఆయనతో తలపడుతున్న వారు ఇంటెలిజెన్స్ ఎస్పీ మధు.. ఈ రెండు వర్గాల వైరం కారణంగానే విశాఖలో భూ కబ్జాలు అన్నవి ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.
విశాఖ కేంద్రంగా భూ కబ్జా ఆరోపణలు విపరీతంగా వినిపిస్తున్నాయి. విలువయిన భూములు అన్నీ అధికార పార్టీ కోటాలోకే వెళ్లిపోతున్నాయి అన్న అభియోగాలు వస్తున్నాయి. వైసీపీ సర్కారు వచ్చాక టీడీపీ భూములు కొన్ని లాక్కుని పోయారు అని కూడా అయ్యన్న పాత్రుడు లాంటి సీనియర్లు గగ్గోలు పెట్టారు. పెడుతున్నారు కూడా ! ఓ భూ తగాదా విషయమై తనకు కూడా చేదు అనుభవమే ఎదురయిందని విజయ సాయి రెడ్డి ( రాజ్యసభ సభ్యులు) పై ఆరోపణలు చేశారు. వీటిలో నిజం ఎంతన్నది తేలకపోయినా వీటిని ఖండించే పని మాత్రం వైసీపీ ఎందుకనో చేయలేదు. దీంతో ఆ నాటి నుంచి ఈ నాటి వరకూ వైసీపీపై ఏవో ఆరోపణలు వెల్లువలా వస్తూనే ఉన్నాయి.
తాజాగా విశాఖ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి ఓ భూ కబ్జా వివాదంలో ఇరుక్కున్నారు. ఓ పోలీసు ఉన్నతాధికారి (ఇంటెలిజెన్స్ ఎస్పీ) భూమిని ఆక్రమించుకుని తన సైట్ కు రహదారి వేసుకున్నారు అని ఆయన పోలీసులకు సైతం ఫిర్యాదు చేశారు అన్నది ప్రధాన మీడియాలో వినిపిస్తున్న మాట. కనిపిస్తున్న వార్త కూడా ఇదే ! పీఎం పాలెం కేంద్రంగా జరిగిన లేదా జరుగుతున్న ఈ వివాదంలో తన తప్పేమీ లేదని విశాఖ ఎంపీ చెబుతుండడం విశేషం.
ఇక ఈ వివాదం పోలీసుల దృష్టికి కూడా వెళ్లింది. ఎంపీ చెబుతున్న మాటలకూ ఎస్పీ చెబుతున్న మాటలకూ అస్సలు పొంతనే లేదని తేలిపోయింది. దీంతో పోలీసులు పూర్తి సర్వే చేశాకనే వివాదం తేలుస్తామని అంటున్నారు. బాధితులు మాత్రం ఎంపీ పోలీసుల సాయం తీసుకుని తమను బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ఇక రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగి ఎస్పీ స్థలంలో ఉన్న ప్రభుత్వ భూమి ఎంత ? ఎంపీ ఎందుకని నిబంధనలు అతిక్రమించి రోడ్డు వేస్తున్నారు.. ఎస్పీ స్థలంలో రోడ్డు వేయించాల్సిన అవసరం ఏమొచ్చింది తదితర విషయాలు తేలాల్సి ఉంది.