ఆ ఎమ్మెల్యే స్పీడుతో వైసీపీ ఇరకాటంలో పడిందా

-

విశాఖ రాజధాని అంటూ ఎప్పుడైతే చర్చ మొదలైందో అప్పటి నుంచి స్టీల్ సిటీ భూముల చుట్టునే రాజకీయ చర్చ నడుస్తుంది. ఇక అధికారి పార్టీ నేతలు కూడా భూముల విషయంలో గతంలో స్పీడ్ పెంచినా సీఎం వార్నింగ్ తో సైలెంట్ అయ్యారు. ఇటీవల తనపై వచ్చిన భూ ఆక్రమణల ఆరోపణలను బహిరంగంగానే ఒప్పేసుకుని ఓ యువ ఎమ్మెల్యే స్వపక్షానికే షాకిచ్చారట..ఎమ్మెల్యే వ్యాఖ్యలతో అధికార వైసీపీ కూడా ఇరుకునపండింది.

విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే గా మొదటి సారి విజయం సాధించారు అదీప్‌రాజు. పరవాడ మండలం వాడచీపురుపల్లి గ్రామంలో ఎమ్మెల్యే కుటుంబానికి కరుణ ఆక్వా పరిశ్రమ ఉంది. సర్వే నెంబరు 464లో 6 ఎకరాల కొండ పోరంబోకును ఆక్రమించి కరుణ ఆక్వా సంస్ధ నిర్మాణాలు చేపట్టిందట. ఈ వ్యవహారాన్ని టీడీపీ ప్రశ్నించడంతో అసలు కథ మొదలైంది. ఎమ్మెల్యే కుటుంబం భూ ఆక్రమణలు చేసిందంటూ ఏకంగా డ్రోన్ వీడియోలను బయట పెట్టారు టీడీపీ నేత, మాజీ మంత్రి బండారు సత్యానారాయణ మూర్తి.

టీడీపీ ఆరోపణలను తిప్పికొట్టాలని.. ఈ వ్యవహారాన్ని సమన్వయం చేసే బాధ్యత తీసుకోవాలని అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్‌కు చెప్పారట. ఆ మేరకు ఇద్దరు ఎమ్మెల్యేలు మీడియా ముందుకు వచ్చారు. విమర్శలను ఎదుర్కొనే క్రమంలో ఎమ్మెల్యే అదీప్‌రాజు అసలు గుట్టు బయటపెట్టేశారు. ఎవరు అడగని సమాచారం లీక్ చేసేశారు. 1995 నుంచి తమ అధీనంలో 6 ఎకరాల ప్రభుత్వ భూమి ఉన్న మాట నిజమేనని ప్రకటించారు అదీప్‌రాజు. ధర ఎంతో చెబితే చెల్లిస్తామని గతంలోనే ప్రభుత్వానికి లేఖ రాశామన్నారు.

ఎమ్మెల్యే పై ఆరోపణలను కవర్ చేద్దామని వచ్చిన మరో ఎమ్మెల్యే అమర్నాథ్‌ ఆదీప్ రాజు వ్యాఖ్యలతో షాక్ తిన్నారట. ఆరోపనలను ఎమ్మెల్యేనే ఒప్పుకోవడంతో టీడీపీకి కొత్త అస్త్రం దొరికినట్లైంది.ఇక చేసేదేమీ లేక మొత్తం పరిణామాలను ఆయన పెద్దల దృష్టికి తీసుకెళ్లారట. ఇక్కడి నుంచే అధికారపార్టీకి అసలు చికాకు మొదలైందని సమాచారం.

కొన్ని నెలలుగా విశాఖలో ప్రభుత్వ భూముల ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నడుస్తోంది. పార్టీలకు అతీతంగా అందరిపైన ఒకే తరహా చర్యలు ఉంటాయనే బలమైన సంకేతాలు వెళ్తున్నాయి. గీతం యూనివర్శిటీ, ఎమ్మెల్యే వెలగపూడి, మాజీ మంత్రి గంటా, అనకాపల్లి మాజీ ఎమ్మెల్యే గోవింద్ సత్యనారాయణకు చెందినదిగా చెబుతున్న భూములు సహా పలువురు నేతల లెక్కలు ఇందులో ఉన్నాయి. సుమారు 2 వేల కోట్ల విలువైన భూమిని వెనక్కు తీసుకున్నామని సర్కార్ ప్రకటిస్తున్నా.. వీటిలో ఫలానా రాజకీయ నాయకుడి బినామీ అని నిర్ధిష్టంగా చెప్పలేని పరిస్ధితి ఉంది.

ఇప్పుడు ఎమ్మెల్యే అదీప్‌రాజు కబ్జాను స్వయంగా అంగీకరించడం వైసీపీ పెద్దల ఆగ్రహానికి కారణమైందని సమాచారం. రానున్న రోజుల్లో ఆక్రమణాలపై దూకుడుగా వెళ్లాలంటే ముందుగా వైసీపీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుందని అధికారపార్టీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. వివాదం పెద్దది కాకుండా పార్టీ ముఖ్యులు ఎమ్మెల్యే అదీప్‌రాజుకు గట్టి సూచనే చేసినట్టు తెలుస్తోంది. మార్కెట్ రేటు చెల్లించి ఆరు ఎకరాల ప్రభుత్వ భూమిని రెగ్యులరైజ్‌ చేసుకోవాలని చెప్పారట. ఆ లెక్కన ఎమ్మెల్యే తక్కువలో తక్కువ 2 కోట్లైనా ప్రభుత్వానికి కట్టక తప్పదు. దీంతో అదీప్‌రాజు డైలమాలో పడ్డారట.

Read more RELATED
Recommended to you

Latest news