భారత యంగ్ చెస్ గ్రాండ్ మాస్టర్, 17 ఏళ్ల గూకేష్ డి అద్భుతమైన విజయం సాధించాడు. ఐదుసార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌తో గూకేష్ తొలిసారి మ్యాచ్ ఆడి ఓడించాడు. గ్రాండ్ చెస్ టూర్‌లో భాగంగా ఈ టోర్నీ జరుగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో విశ్వనాథన్ ఆనంద్‌పై గూకేష్ విజయం సాధించడం గమనార్హం.ర్యాపిడ్ ఈవెంట్‌లో ఎనిమిదో రౌండ్‌లో గూకేష్ విక్టరీ సాధించాడు. దీంతో ఇద్దరూ పదేసి పాయింట్లతో నాలుగో స్థానంలో టైగా నిలిచారు. ఈ మ్యాచ్‌లో గూకేష్ 40 మూవ్స్‌లో విశ్వనాథన్‌ను ఓడించడం గమనార్హం. ఆనంద్‌పై గూకేష్ ఆడిన తొలి మ్యాచ్ ఇదే. ఈ మ్యాచ్‌లనే అతను విజయం సాధించగం విశేషం. ఈ విజయం తనకు చాలా కీలకమని, చాలా సంతోషంగా ఉన్నానని గూకేష్ చెప్పాడు.
తొలి రోజున పాయింట్ల పట్టికలో లీడర్‌గా నిలిచిన విశ్వనాథన్ ఆనంద్.. రెండు పాయింట్లు కోల్పోయాడు. దీంతో ఫాబియానో కరూనా, నెపోనియాచి ఇద్దరూ చెరో 12 పాయింట్లతో లీడర్లుగా నిలిచారు. ప్రపంచ నెంబర్ వన్ మాగ్నస్ కార్లసన్ మళ్లీ ఫామ్ అందుకొని మూడో స్థానానికి ఎగబాకాడు. గూకేష్ చేతిలో ఓటమి పాలైన ఆనంద్.. పోలాండ్ ప్లేయర్ జాన్ కిర్జిస్టాఫ్ దూడ, నెపోనియాచితో జరిగిన రెండు మ్యాచులను డ్రాగా ముగించాడు.