మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ వచ్చింది మొదలు విజయనగరం వైసీపీలో వర్గ విభేదాలు ఒక్కసారిగా బయటపడ్డాయి. వైసీపీ సీనియర్ నేత మంత్రి బొత్స,స్థానిక ఎమ్మెల్యే మధ్య నడుస్తున్న కోల్డ్ వార్ స్థానిక నేతల రాజీనామా వరకు వెళ్లింది. పార్టీ కీలక నేత విజయసాయిరెడ్డి రంగంలోకి దిగి ఇచ్చిన హామీలు ఏ మేరకు ఫలితాన్నిస్తాయో అన్న చర్చ విజయనగరం వైసీపీ నేతల్లో నడుస్తుంది.
మంత్రి బొత్స వర్గం మొత్తాన్ని పక్కనపెట్టిన ఎమ్మెల్యే కోలగట్ల వీరభ్రదస్వామి… తన అనుచరులకు మాత్రమే 50 డివిజన్లలోనూ బీ-ఫామ్స్ ఇచ్చారు. దీంతో బొత్స వర్గమైన అవనాపు సోదరులతో పాటు… అనేకమంది రెబల్స్‌గా బరిలోకి దిగారు. 50 డివిజన్లకు గాను 19 చోట్ల రెబల్స్ నామినేషన్లు వేశారు. అంతటితో ఆగకుండా.. సీఎం జగన్, ఎంపీ విజయసాయిరెడ్డితో పాటు… పార్టీ కీలక నేతల దగ్గర కూడా పంచాయితీ పెట్టారు.
పార్టీ ఏర్పాటైనప్పటి నుంచి జెండా మోసామని… న్యాయం చేయాలంటూ వైసీపీ పెద్దలను కోరారు. మరోవైపు ఎమ్మెల్యే కోలగట్ల సైతం… తాను కావాలో, అవతలి వారు కావాలో తెల్చుకోవాలంటూ పార్టీ పెద్దలకు తెగేసి చెప్పడంతో… ఎవరికి సర్దిచెప్పాలో తెలియక వైసీపీ పెద్దలు సతమతమయ్యారు. నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగిసిపోయే సమయం వచ్చినా విభేదాలు పరిష్కారం కాకపోవడంతో..ఎమ్మెల్యే కోలగట్లకు, రెబల్స్‌కు మధ్య సయోధ్య కుదిర్చేందుకు వైసీపీ కీలక నేతలు రంగంలోకి దిగారు.
పార్టీలోని రెండు వర్గాలతో సమావేశమై… అవనాపు సోదరులకు నామినేటెడ్ పోస్టులు ఇస్తామని వారి సమక్షంలోనే ఎమ్మెల్యే కోలగట్లకు విజయసాయిరెడ్డి చెప్పారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. దాంతో అవనాపు సోదరులతో పాటు చాలా మంది రెబల్స్ ఆ ప్రతిపాదనకు అంగీకరించి పోటీ నుంచి తప్పుకున్నట్లు చెబుతున్నారు. మొత్తమ్మీద రెండు వర్గాల మధ్య విభేదాలు సమసినట్టేనా అన్న చర్చ నడుస్తుంది.