ఎమ్మెల్యే తిట్టాడంటూ పురుగుల మందు తాగిన మహిళా వాలంటీర్

ఏపీలో ఒక దారుణ ఘటన చోటు చేసుకుంది. స్థలం ఆడిగిందని మహిళా వలంటీర్ మీద వైసీపీ ఎమ్మెల్యే బూతులు వర్షం కురిపించాడు. పి గన్నవరం నియోజక వర్గం పరిధిలో వైసిపి పాదయాత్ర సందర్భంగా మహిళా వాలంటీర్ పై ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు వీరంగం ఆడారు. మామిడికుదురు మండలం నగరంలో గ్రామ వాలంటీర్‌గా పనిచేస్తోన్న సువర్ణ ఇళ్ల స్థలం కోసం దరఖాస్తు చేసింది. అయితే ఒక వాలంటీర్ అయ్యుంది ఇలా చేస్తావా అంటూ వందల మంది సమక్షంలో ఆమెమీద ఎమ్మెల్యే చిట్టిబాబు దుర్భాషలు ఆడారు.

దీంతో మనస్తాపానికి గురైన మహిళా వాలంటీర్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. దీంతో ఆమెను రాజోలు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మహిళా వాలంటీర్ పట్ల ఎమ్మెల్యే ప్రవర్తనపై స్థానికులే కాక వైసీపీ నేతలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళ అని కూడా చూడకుండా బూతులు తిట్టడం తప్పేనని అంటున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.