తెలంగాణ శాసన మండలిలోని మహబూబ్‌నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఉపాధ్యాయ నియోజకవర్గంలో నమోదైన ఓటర్ల సంఖ్యను ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటి వరకు మొత్తం 29,720 ఓటర్లు నమోదయినట్లు ఈసీ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ నియోజకవర్గానికి వచ్చే నెల 13న పోలింగు జరగనుండగా 16న ఓట్ల లెక్కింపు చేపడతారు.
ఓటు హక్కు వినియోగించుకునేందుకు వీలుగా 137 పోలింగు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. వాటిలో 126 ప్రధాన పోలింగు కేంద్రాలు, మరో 11 అదనపు పోలింగు కేంద్రాలుగా ప్రకటించింది. తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తరవాత ఓటర్లుగా నమోదు చేసుకునేందుకు 4,237 దరఖాస్తులు వస్తే క్షేత్రస్థాయి అధికారులు పరిశీలించి 2,177 అర్హమైనవిగా ప్రకటించారు. మొత్తం ఓటర్లలో 15,472 మంది పురుషులు, 14,246 మంది మహిళలుగా కాగా ఇద్దరు ఇతరులున్నారని ఎన్నికల అధికారులు వెల్లడించారు.