కరోనా లాక్‌డౌన్ వల్ల హెయిర్ సెలూన్ షాపులు మూతపడడంతో జనాలు హెయిర్ కటింగ్, ట్రిమ్మింగ్, షేవింగ్.. లాంటివి చేయించుకోవడానికి తెగ ఇబ్బందులు పడిపోతున్నారు. అయితే కొందరు సొంతంగా ఆయా పనులు చేసుకోవడమో, లేదా ఇతరులతో హెయిర్‌కట్ చేయించుకోవడమో చేస్తున్నారు.. కానీ.. ఎంతైనా ప్రతి ఒక్కరూ హెయిర్ ఎక్స్‌పర్ట్‌లు కాదు కదా.. అందుకని కొన్నిసార్లు పొరపాట్లు చేస్తున్నారు. అయితే మన దేశంలో హెయిర్ సెలూన్ల సంగతి అటుంచితే.. జర్మనీలో మాత్రం అవి ఓపెన్ అయ్యాయి. కానీ.. హెయిర్ కట్ చేయించుకోవాలంటే.. జనాలు ముందుగా పలు ఫాంలను నింపాల్సి వస్తోంది.
జర్మనీలో 6 వారాల లాక్‌డౌన్ అనంతరం పలు సడలింపులు ఇచ్చారు. దీంతో హెయిర్ సెలూన్ షాపులు ఓపెన్ అయ్యాయి. అయితే షాపులు ఓపెన్ అయ్యాయి కదా అని చెప్పి.. మూకుమ్మడిగా వెళ్లి హెయిర్ కట్ చేయించుకుందామంటే కుదరదు. ఎందుకంటే.. అక్కడ అందుకు నిబంధనలు పెట్టారు. హెయిర్ సెలూన్ షాపుకు వెళ్లాలనుకునేవారు ముందుగా అపాయింట్‌మెంట్ తీసుకోవాలి. ఈ క్రమంలో కస్టమర్లు షాపు వారు సూచించిన టైముకు వెళ్లి కటింగ్ చేయించుకోవాలి. ఆ తరువాత వారి పేరు, చిరునామా, ఫోన్ నంబర్, వారు షాపుకు ఏ టైముకు వెళ్లింది, ఏ టైముకు బయటకు వచ్చింది.. తదితర వివరాలను నమోదు చేయాలి. అలా అయితేనే సెలూన్ షాపులను నిర్వహించుకునేందుకు అనుమతి ఉంటుంది.
ఇక ప్రభుత్వం సూచించిన నిబంధనలను పాటించకపోతే సెలూన్ షాపుల యజమానులకు ఏకంగా 500 యూరోలు (దాదాపుగా రూ.41వేలు) జరిమానా విధిస్తారు. లాక్‌డౌన్ అనంతరం ఆంక్షలను సడలించినప్పటికీ జర్మనీ సోషల్ డిస్టాన్స్ నిబంధనలను మాత్రం కఠినంగా అమలు చేస్తోంది. కాగా అక్కడ ఇప్పటి వరకు 1.66 లక్షల మంది కరోనా సోకగా 1.28 లక్షల మంది ఇప్పటికే రికవరీ అయ్యారు. 7వేల మంది చనిపోయారు.