పెట్రోల్, డీజిల్ ధరలు రోజు రోజుకీ మండిపోతున్నాయి. ఇంధన ధరలు చుక్కలనంటుతుండడంతో జనాలు ఎక్కువగా ప్రజా రవాణాను ఆశ్రయిస్తున్నారు. అయితే మరో వైపు కరోనా భయం ఉండడంతో చాలా మంది సొంతంగా వాహనాలను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా చాలా మంది కరెంటుతో నడిచే టూ వీలర్లను కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. వీటి వల్ల ఎంతో ఇంధనం ఆదా అవుతుంది. మైలేజీ బాగా వస్తుంది. కనుక రవాణా చార్జిలు కూడా తగ్గుతాయి. ఈ క్రమంలోనే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న ఉత్తమ విద్యుత్ టూవీలర్లు ఏవో, వాటి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
1. బజాజ్ చేతక్
పురాతన చేతక్ మోడల్‌కు మార్పులు, చేర్పులు చేసిన బజాజ్ కొత్త చేతక్ ఎలక్ట్రిక్ వేరియెంట్ రూపంలో అందుబాటులోకి తెచ్చింది. ఈ స్కూటర్ ధర రూ.1 లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఉంది. దీనిపై గంటకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో వెళ్లవచ్చు. ఒక్కసారి ఈ స్కూటర్‌లోని బ్యాటరీని ఫుల్ చార్జింగ్ చేస్తే ఏకంగా 95 కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తుంది. ఇందులో డిస్క్ బ్రేక్ ఆప్షన్‌ను కూడా అందిస్తున్నారు.
2. ఎనిగ్మా జీటీ-450
ఈ టూవీలర్ గరిష్టంగా 120 నుంచి 140 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. దీని ధర రూ.64వేల నుంచి రూ.80వేల వరకు ఉంది. ఇది కూడా మార్కెట్‌లో వినియోగదారుల ఆదరణను చూరగొంటోంది.
3. రివోల్ట్ ఆర్‌వీ 400
ఈ టూవీలర్ 3వేల వాట్ల మోటార్ ఆధారంగా పనిచేస్తుంది. ఒక్కసారి చార్జింగ్ పెడితే 150 కిలోమీటర్ల వరకు మైలేజీని ఇస్తుంది. ఈ వాహనం అహ్మదాబాద్, చెన్నై, హైదరాబాద్, పూణె నగరాల్లోనే అందుబాటులో ఉంది. దీని ధర రూ.1.03 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది.
4. ప్యూర్ ఈవీ ఇప్లూటో
ఈ వాహనం ధర రూ.71,999గా ఉంది. దీని బరువు 79 కిలోలే. అందువల్ల సులభంగా హ్యాండిల్ చేయవచ్చు. ఇందులో ఏబీఎస్ ఫీచర్ లభిస్తోంది. ఈ వాహనం గంటకు గరిష్టంగా 60 కిలోమీటర్ల వేగంతో వెళ్తుంది. చార్జింగ్ అయ్యేందుకు 4 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 90 నుంచి 120 కిలోమీటర్ల వరకు మైలేజీ వస్తుంది.