ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో జనాభా విపరీతంగా పెరుగుతున్నప్పటికీ కొన్నిదేశాల్లో మాత్రం తగ్గుదల కనిపిస్తోంది. అందుకు కారణంగా గత దశాబ్ద కాలంగా ఆయా దేశాల్లో జననాల రేటు తక్కువగా ఉండడమే. అక్కడ జన్మించే వారి కన్నా చనిపోయే వారు ఎక్కువగా ఉన్నారు. అందువల్ల జనాభా రేటు తగ్గుతోంది. అయితే దక్షిణ కొరియాలో కూడా జనాభా తగ్గుతోంది. దీంతో ఆ దేశంలోని ఒక నగరానికి చెందిన పాలనా విభాగం అక్కడి దంపతులకు ఓ వినూత్న ఆఫర్‌ను ప్రకటించింది. అదేమిటంటే..
దక్షిణ కొరియాలోని సౌత్ జియోంగ్సాంగ్ ప్రావిన్స్‌లోని చాంగ్వాన్ అనే నగరంలో దంపతులకు పిల్లల్ని కంటే రూ.73 లక్షలను ఇస్తున్నారు. అయితే ఆ మొత్తం లోన్‌గా ముందు లభిస్తుంది. ఈ క్రమంలో దంపతులు ముందుగా ఒకరిని కంటే లోన్‌కు చెందిన వడ్డీ మొత్తాన్ని మాఫీ చేస్తారు. రెండో సంతానాన్ని కంటే లోన్ వడ్డీతోపాటు, లోన్ అసలు నుంచి 30 శాతం మొత్తాన్ని మాఫీ చేస్తారు. ఇక మూడో సంతానాన్ని కంటే లోన్ మొత్తం, వడ్డీ మొత్తం మాఫీ చేస్తారు.
2020లో దక్షిణ కొరియాలో 2,75,815 జననాలు సంభవించగా, 3,07,764 మరణాలు సంభవించాయి. జనాభా తగ్గుదలలో గణనీయమైన మార్పు వస్తోంది. దీంతో ఆ సిటీ పాలనా విభాగం పిల్లల్ని కనే దంపతులకు ఆ ఆఫర్‌ను ప్రకటించింది. అంటే ముగ్గురు పిల్లల్ని కంటే రూ.73 లక్షలు పొందవచ్చన్నమాట..!