స్నేహితుల గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా.. ఎందుకంటే బెస్ట్ ఫ్రెండ్ ఎప్పుడూ ది బెస్ట్ ఏ అని చెప్పుకోవచ్చు. కులమతాలకు అతీతంగా తమ ఇష్టాలకు దగ్గరగా ఉండే వాళ్లు తమకు స్నేహితులుగా మిగిలిపోతారు. ఇలాంటి బంధమే మనం జంతువుల్లో చూస్తుంటాం. అయితే అడవుల్లో నివసించే జంతువులు కేవలం తమ సమూహానికి చెందిన వాటితోనే స్నేహం చేస్తుంటాయి. కానీ ఓ ఏనుగు, ఓ గేదే స్నేహాన్ని ఎప్పుడైనా చూశారా.. అలాంటి వీడియోనే సోషల్ మీడియాలో ప్రస్తుతం చక్కర్లు కొడుతోంది.
స్నేహితులు అన్నాకా.. లక్షా తొంబై గొడవులు. తరచూ గొడవలు పడుతూనే ఎంతో అన్యోన్యంగా మెలుగుతుంటారు. నిగిలై అనే ఏనుగు.. ఐవియా అనే గేదే స్నేహం కూడా అలాంటిదే. వీరి స్నేహాన్ని చూసి ఇష్టపడని వారు ఉండరు. షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో ఈ రెండు జంతువుల మధ్య ఉండే ప్రత్యేక అనుబంధాన్ని వీడియో తీసి పోస్ట్ చేసింది. ఈ రెండు జంతువుల మధ్య ఎంతో తేడా ఉన్నా.. వీరు ఎలా మంచి స్నేహితులుగా మారారనే విషయాన్ని మనం ప్రస్తుతం ఈ వీడియోలో చూడవచ్చు.
View this post on Instagram
ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. షెల్డ్రిక్ వైల్డ్‌లైఫ్ ట్రస్ట్ తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది. దీనికి..‘‘నిగిలై, ఐవియా ఎంతో మంచి స్నేహితులు. తరచూ ఆటలాడుతూ ఉంటాయి. అప్పుడప్పుడు పొట్లాడుతాయి కూడా. ఏ రోజూ ఒకరిని విడిచి ఒకరు ఉండరు.’’ అని క్యాప్షన్ కూడా రాసింది. కాగా, నిగిలై, ఐవియా ఇద్దరూ అనాథలు. ప్రస్తుతం వీటి సంరక్షణ బాధ్యతలు జంతు సంరక్షణ ఆధ్వర్యంలో జరుగుతోంది. తగిన రోజు చూసి వీటిని అడవిలో వదిలేస్తామని జంతు సంరక్షణ అధికారులు పేర్కొన్నారు. అయితే ఈ రెండు జంతువులు ఆప్యాయంగా గొడవ పడటం చూసి పలువురు జంతు ప్రేమికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. వీరి స్నేహానికి దిష్టి తగలొద్దు.. ఎంత ముద్దుగా గొడవ పడుతున్నారంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.