గత వారం రోజుల క్రితం భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. అయితే దీంతో జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రిజర్వాయర్‌ల గేట్లు తెరిచి వరద నీటిని కిందికి వదులుతున్నారు. అయితే చెరువులు, వాగులు నిండిపోవడంతో వరద నీరు గ్రామాల్లో వచ్చి చేరుతోంది. ఇప్పటికే తెలంగాణ చాలా గ్రామాలు వరదల్లో చిక్కుకున్నాయి. అయితే ఈ నేపథ్యంలో.. రాష్ట్రంలో వరద పరిస్థితిని పర్యవేక్షిస్తున్న ఆరోగ్య శాఖ, 24 గంటలూ పనిచేసే వార్‌రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రజల సమస్యల పరిష్కారం కోసం 90302 27324, 040-24651119 హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేసింది. గత వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎనిమిది జిల్లాల్లోని నీట మునిగిన ప్రాంతాల్లోని ప్రజలకు వైద్య సేవలను ఆరోగ్య బృందాలు అందిస్తున్నాయి. ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, ములుగు, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలు ఈ జాబితాలో ఉన్నాయి.
ఈ జిల్లాల్లో ప్రజారోగ్య పరిరక్షణ చర్యలను పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక వార్ రూమ్ ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ వార్ రూమ్ హెల్ప్ లైన్ నంబర్లకు ఫోన్ చేసి ప్రజలు సహాయం పొందవచ్చని తెలిపారు వైద్య శాఖ అధికారులు. ప్రభావిత జిల్లాల్లో జిల్లా, డివిజన్ స్థాయిల్లో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్ లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు వైద్య శాఖ అధికారులు. ప్రజల సహాయార్ధం ప్రత్యేక హెల్ప్ లైన్ నంబర్లను ఏర్పాటు చేయాలని ఆయా జిల్లాల వైద్య యంత్రాంగాలకు నిర్దేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. ఇప్పటికే పలు జిల్లాల్లో వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు వైద్య శాఖ అధికారులు.