భారత్‌లో ప్రస్తుతం 3 రకాల కోవిడ్ వ్యాక్సిన్లను పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. కోవిషీల్డ్, కోవాగ్జిన్, స్పుత్నిక్ టీకాలను అందిస్తున్నారు. అయితే ఈ టీకాలను నిల్వ చేసేందుకు 2 నుంచి 8 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కావాలి. కానీ మైన్‌వ్యాక్స్ అనే స్టార్టప్ అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్‌కు తక్కువ ఉష్ణోగ్రత అవసరం లేదు. గది ఉష్ణోగ్రత వద్ద కూడా వ్యాక్సిన్ పాడు కాకుండా ఉంటుంది. దీన్ని త్వరలోనే అందుబాటులోకి తేనున్నారు.
ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ సొసైటీ ఫర్ ఇన్నొవేషన్ అండ్ డెవలప్మెంట్ (ఎస్ఐడీ) ఆధ్వర్యంలో కొనసాగుతున్న మైన్‌వ్యాక్స్ అనే స్టార్టప్ ఓ నూతన కోవిడ్ వ్యాక్సిన్‌కు ట్రయల్స్ నిర్వహిస్తోంది. ఆ ట్రయల్స్ ను ఇటీవలే ఎలుకలపై నిర్వహించారు. అందులో ఆసక్తికరమైన ఫలితాలు వచ్చాయి. సదరు వ్యాక్సిన్ కోవిడ్‌ను సమర్థవంతంగా ఎదుర్కొంది. కోవిడ్‌కు చెందిన ఆల్ఫా, బీటా, గామా వంటి వేరియెంట్లను ఆ వ్యాక్సిన్ సమర్థవంతంగా నాశనం చేసింది. దీంతో ఈ వ్యాక్సిన్‌కు త్వరలో హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహించి వీలైనంత త్వరగా అందుబాటులోకి తేనున్నారు.
మైన్ వ్యాక్స్ కంపెనీ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్‌ను నిల్వ చేసేందుకు గది ఉష్ణోగ్రత ఉన్నా చాలు. నెల రోజుల పాటు వ్యాక్సిన్ నిల్వ ఉంటుంది. దీంతో దాన్ని మారుమూల ప్రాంతాలకు ఎక్కడికైనా సులభంగా రవాణా చేయవచ్చు. అధిక శాతం మందికి టీకాలను వేయవచ్చు. ప్రస్తుతం ఉన్న టీకాలను నిల్వ చేసేందుకు కనీసం 2 నుంచి 8 డిగ్రీల ఉష్ణోగ్రత అవసరం అవుతుంది. కనుక మైన్‌వ్యాక్స్ టీకా గేమ్ చేంజర్ అవుతుందని సైంటిస్టులు భావిస్తున్నారు.
ఇక ఈ టీకా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ఱోగ్రత వద్ద 90 నిమిషాల పాటు పాడు కాకుండా ఉంటుంది. అదే 70 డిగ్రీల టెంపరేచర్ అయితే 16 గంటల పాటు ఉంటుంది. 37 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ఱోగ్రత వల్ల ఈ టీకా నెల రోజుల పాటు నిల్వ ఉంటుంది. అందుకనే దీన్ని వీలైనంత త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇక దీన్ని వార్మ్ వ్యాక్సిన్ గా పిలుస్తున్నారు. అంటే ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కూడా నిల్వ ఉంటుందన్నమాట.