సమిష్టి కృషితోనే అద్భుత పురోగతి సాధించామన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్. నిర్మల్ జిల్లాలో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్‌ను సీఎం ఆదివారం ప్రారంభించారు. శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై చాంబర్‌లో కలెక్టర్ వరుణ్ రెడ్డిని కూర్చోబెట్టి అభినందనలు తెలియజేశారు. అనంతరం ముఖ్యమంత్రి ప్రసంగిస్తూ.. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు నాలుగు మెడికల్ కాలేజీలు మంజూరు చేశామని ఆయన తెలిపారు. రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి బాగుందని.. తాగు, నీటి సమస్యను అధిగమించామని సీఎం అన్నారు.
తెలంగాణ వచ్చిన తర్వాత మనందరం కలిసి.. సమిష్టి కృషితో అద్భుత ఫలితాలు సాధించగలిగాం. అందులో అనుమానం అక్కర్లేదు. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నాలుగు జిల్లాలుగా విభజింపబడి పరిపాలన ప్రజలకు చేరువైంది. నాలుగు జిల్లాలకు మెడికల్ కాలేజీలు వస్తున్నాయి. ఆసిఫాబాద్ లాంటి అడవి ప్రాంతంలో కూడా మెడికల్ కాలేజీ వచ్చింది. ఏపీలో ఉంటే 50 ఏండ్లకు కూడా ఈ కాలేజీ వచ్చేది కాదు. పవర్ పర్ క్యాపిటలో నంబర్ వన్ లో ఉన్నాం. ముఖ్రా కే గ్రామం జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు తీసుకొని మనకు గౌరవం తెచ్చిపెట్టిందని కేసీఆర్ గుర్తు చేశారు.