భారత్, పాక్ దేశాల మధ్య ప్రస్తుతం నెలకొని ఉన్న యుద్ధ వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ శాంతి చర్చలంటూ భారత్ ఎదుట ఓ కొత్త ప్రతిపాదన ఉంచారు. ఇరు దేశాలు సంయమనం పాటించాలని, కేవలం చర్చల ద్వారానే సమస్యలు పరిష్కారమవుతాయని ఇమ్రాన్ అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భారత్‌ను మరోసారి శాంతి చర్చలకు ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ఉద్రిక్తలు పెరిగితే పరిస్థితులు తీవ్రంగా మారుతాయని అన్నారు.
భారత్, పాక్ దేశాలు కలసి కూర్చుని మాట్లాడుకోవాలని ఇమ్రాన్ ఖాన్ భారత్‌ను చర్చలకు ఆహ్వానించారు. ఉగ్రవాదాన్ని అంతం చేసేందుకు ఏం చేయాలో చెప్పండి.. అంటూ మోడీని ఇమ్రాన్ సలహా అడిగారు. తాము భారత్‌కు చెందిన రెండు యుద్ధ విమానాలను కూల్చేశామని తెలిపారు. కలసి కూర్చుని మాట్లాడుకుంటే సమస్య పరిష్కారమవుతుందన్నారు.
భారత పైలట్లు ఇద్దరు తమ అదుపులో ఉన్నారని పాక్ ప్రధాని ఇమ్రాన్ వెల్లడించారు. ఆలస్యం చేస్తే మోడీతోపాటు తన పరిధి నుంచి కూడా పరిస్థితి చేయి దాటి పోతుందని, యుద్ధం మొదలైతే ఆపడం తన చేతిలో ఉండదని ఇమ్రాన్ అన్నారు. తమ వద్ద కూడా భారత్‌లాగే బలమైన ఆయుధాలు ఉన్నాయని, అయితే యుద్ధంతో కాకుండా సమస్యలను శాంతియుతంగా పరిష్కరించుకుందామని ఇమ్రాన్ అన్నారు. కాగా భారత్‌కు చెందిన ఎయిర్ ఇండియా కమాండర్ విక్రమ్ అభినందన్‌ను పాక్ ఆర్మీ అదుపులోకి తీసుకుని అతన్ని తీవ్రంగా గాయ పరిచిన విషయం విదితమే. ఆ నేపథ్యంలోనే పాక్ ప్రధాని ఇమ్రాన్ ఈ వ్యాఖ్యలు చేశారు.