Weather updates: మళ్లీ వానాల జోరు మొదలైంది. తెలుగురాష్ట్రాల్లో రాగాల మూడు రోజుల పాటు ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, పలు జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ నుంచి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రస్తుతం సగటు సముద్రమట్టానికి 900 మీటర్ల ఎత్తున కొనసాగుతుందనీ. దీని ప్రభావం వల్ల భారీగా గాలులు వీచే అవకాశముందని తెలుస్తుంది. అలాగే.. బంగాళాఖాతం వాయువ్య ప్రాంతంలో 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వానలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది .
తెలంగాణలో పలు చోట్ల ఉరుములు మెరుపుతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, మంచిర్యాల, కొమ్రంభీం అసిఫాబాద్, పెద్దపల్లి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, జనగామ, హన్మకొండ, వరంగల్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని పలు చోట్ల భారీ వర్షాలు పడతాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరింది.అలాగే.. ఆదిలాబాద్, కొమ్రంభీమ్ అసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి జిల్లాల్లోని భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
అటు ఏపీలోనూ ఇదే పరిస్థితి ఉన్నట్టు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. విశాఖ జిల్లాలో పలు చోట్ల వర్షాలు బీభత్సం సృష్టించాయి. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు. ఈ రోజు, రేపు ఉత్తర కోస్తాంధ్రాలో ఉరుములు, మెరుపులతో పాటు భారీ వర్షాలు చాలాచోట్ల కురిసే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. అటు, దక్షిణ కోస్తాంధ్రాలో నేడు మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు ప్రదేశాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.