వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట మండలం కేసారం గ్రామం వద్ద ఓ పెళ్లి బస్సు వరద నీటిలో చిక్కుకుంది. నిర్మాణంలో ఉన్న రైల్వే వంతెన వద్ద వరద నీరు నిలిచింది. పెళ్లికి వెళ్లి తిరిగి వస్తున్న బస్సు వరద నీటిలో చిక్కుకోవడంతో.. అటు ముందుకు కదలలేక.. ఇటు వెనక్కి రాలేక అక్కడే ఇరుక్కు పోయింది. అయితే బస్సులో ఉన్న వారంతా సురక్షితంగానే బయటకు వచ్చారు. కానీ బస్సు మాత్రం అక్కడే ఇరుక్కు పోయింది.

హైదరాబాద్‌లోని బోరబండకు చెందిన పెళ్లి బస్సు వికారాబాద్‌కు వచ్చింది. కోటపల్లి మండలంలో పెళ్లి వేడుకలు ముగించుకుని తిరుగు ప్రయాణం అయింది. అయితే నిర్మాణంలో ఉన్న రైల్వే బ్రిడ్జిని దాటుతుండగా బస్సు ఇరుక్కున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ మేరకు బస్సులో ఉన్న ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీశారు. అలాగే రైల్వే సిబ్బంది సాయంతో విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసి వరద నీటిని బయటకు తోడుతున్నారు.