పైరసీ పై వేటు.. కొత్త సినిమాటోగ్రఫీ చట్టంపై కేంద్రం కీలక నిర్ణయం

-

సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి పెద్ద సమస్య పైరసీ.. ఇప్పటికీ ఎంత ప్రయత్నించినా పైరసీని అరికట్టడం సాధ్యం కావడం లేదు. ఈ విషయంపై ఇప్పటికే పలు మార్లు చర్చలు జరిగినప్పటికీ తాజాగా కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. పైరసీని అరికట్టడానికి కొత్త సినిమాటోగ్రఫీ చట్టాన్ని తీసుకురావడానికి నిర్ణయం తీసుకుంది.

సినీ ఇండస్ట్రీ ని ఎప్పటినుంచో వేధిస్తున్న సమస్య పైరసీ.. అన్ని పరిశ్రమలని దెయ్యంలా పట్టిపీడిస్తున్న ఈ సమస్య ను అరికట్టడం కష్టతరంగా మారింది. స్టార్ హీరోలు సినిమాలు సైతం విడుదలకు ముందే పైరసీకి గురయ్యాయి. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు అర్జున్ సినిమా విడుదలకు ముందే పైరసీకి గురవటంతో అప్పట్లో మహేష్ ఫిలిం ఛాంబర్ దగ్గర కూర్చొని తన నిరసన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది సినిమా అయితే విడుదలకు ముందే డీవీడీ రూపంలో బయటకి వచ్చేసింది. దాదాపు సగం సినిమా బయటకు రావడంతో అప్పట్లో పవన్ కళ్యాణ్ పెద్ద రచ్చే చేశారు. అయినప్పటికీ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించింది. తాజాగా రవితేజ నటించిన రావణాసుర సినిమాలో డైలాగులు సైతం బయటకు వచ్చాయి. ఏది ఏమైనా పలు సినిమాలు మాత్రం పైరసీ కోరల్లో చిక్కుకుపోతున్నాయి.

ఈ పైరసీ భూతం ఓటీటీని సైతం పట్టిపీడిస్తుంది. ఓటిటిలో సినిమాలు వచ్చిన వెంటనే పైరసీలో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ విషయాన్ని ఎలాగైనా అరికట్టాలని ఇప్పటికే పలువురు సినీ ప్రముఖులు కేంద్ర ప్రభుత్వంతో ఎన్నోసార్లు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. కానీ తాజాగా మోడీ ప్రభుత్వం ఈ విషయంపై కీలక నిర్ణయం తీసుకుంది.

మోడీ ప్రభుత్వం సినిమా ఇండస్ట్రీ గురించి ఒక కొత్త చట్టాన్ని తీసుకు రావాలని కీలక నిర్ణయం తీసుకుంది. సినిమా పరిశ్రమని పట్టి పీడిస్తున్న పైరసీని కట్టడి చేసేందుకు సినిమాటోగ్రఫీ చట్టం తీసుకు రావాలని నిర్ణయం తీసుకుంది. ఇందుకు సంబంధించిన బిల్లుని వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఆమోదించనున్నట్లు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ మంత్రి అనురాగ్ ఠాగూర్ తెలియజేశారు. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల నుంచి హర్షం వ్యక్తం అవుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news