పాము పేరు వినగానే అందరు భయంతో వణికి పోతారు..కానీ ఓ ఊరిలో మాత్రం అస్సలు భయపడరు.. నిజంగానే విచిత్రంగా ఉందికదా.. అవునండి మీరు విన్నది అక్షరాల నిజం.. మాములుగా ఎక్కడైనా నాగుల పంచమి రోజుల భక్తులు నాగదేవతకు పూజలు చేస్తారు. పుట్టల వద్దకు వెళ్లి పాములకు పాలు పోస్తారు. ఏదైనా నాగ దేవత ఆలయానికి వెళ్లి అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ బీహార్లోని ఓ గ్రామంలో నాగపంచమి వేడుకలు విభిన్నంగా జరుగుతాయి.
బీహార్లోని బెగుసరాయ్ జిల్లా మన్సూర్చాక్ మండలం ఆగాపూర్ గ్రామంలో నాగపంచమి వేడుకలను చూస్తే ఎవరికైనా ఒళ్లు జలదరిస్తుంది. ఎందుకంటే అక్కడి ప్రజలు నాగ పంచమి వేడుకలను అందరిలా సెలబ్రేట్ చేసుకోరు. విభిన్నంగా ఉంటాయి.భగత్లుగా పిలిచే కొందరు పూజారులు గ్రామంలోని భగవతి ఆలయంలో పూజలు చేస్తారు. అనంతరం డప్పు వాయిద్యాలతో గండక్ నది వద్దకు చేరుకుంటారు. నదిలో పుణ్యస్నానాలను ఆచరించి.. నీటి లోపలి నుంచి పాములను బయటకు తీస్తారు.
భగత్లు పాములను బయటకు తీసిన వెంటనే.. గ్రామస్తులంతా చప్పట్లు, ఈలలు, కేకలతో కేరింతలు కొడతారు. కొందరు భగత్లు చేతలతో మాత్రమే కాదు.. నోటితో పాములను పట్టుకుంటారు. ఆ పాములతో విన్యాసాలు చేస్తూ, వేడుకగా ఊర్లోకి వెళ్తారు.. అవేమీ సాధారణ పాములు కాదు. వాటిలో కొన్ని విష సర్పాలు కూడా ఉంటాయి. ఐనప్పటికీ ప్రజలెవరూ భయపడరు. ఆ పాములు కూడా వారికి ఎలాంటి హాని తలపెట్టవు. వేడుకల అనంతరం పాములను తీసుకెళ్లి మళ్లీ పొదల్లో విడిచిపెడతారు.300 ఏళ్లుగా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. తామంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పాటు నాగ దేవతను పూజిస్తామని.. అందుకే ఆ పాములు తమకు ఎలాంటి హాని తలపెట్టవని చెబుతున్నారు.ఏది ఏమైనా కూడా ఇలా చెయ్యాలంటే చాలా ధైర్యం ఉండాలి..