కృష్ణా జిల్లా రాజకీయాలు పేరు ఎత్తితే ఠక్కున గుర్తొచ్చే నేతల పేరుల్లో టీడీపీ సీనియర్ నేత దేవినేని ఉమా మహేశ్వరరావు పేరు ఖచ్చితంగా ఉంటుంది. అన్న దేవినేని వెంకటరమణ మరణంతో రాజకీయాల్లో యాక్టివ్ అయిన ఉమా..1999లో నందిగామ నుంచి గెలిచి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. ఆ తర్వాత వైఎస్సార్ గాలిలో కూడా 2004లో నందిగామ నుంచి రెండోసారి ఎమ్మెల్యే కూడా గెలుపొందారు. ఇక 2009, 2014 లో మైలవరం నుంచి గెలుపొందారు. నాలుగు సార్లు వరుసగా గెలుస్తున్న మొన్న ఎన్నికల్లో మాత్రం మైలవరం నుంచి ఓటమి పాలయ్యారు. ఇక రాష్ట్ర రాజకీయాల్లోనూ ఉమాను బాబుకు రైట్ హ్యాండ్‌గా చెపుతుంటారు టీడీపీ వాళ్లు.
అయితే ఈయన ప్రతిపక్షంలో ఉన్న, అధికారం పక్షంలో ఉన్న జిల్లా రాజకీయాలపై మంచి పట్టు ఉండేది. జిల్లాలో తానే నెంబర్ 1 లీడర్ అన్నట్లు నడిచేవారు. 2009లో టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడూ జిల్లాపై ఈయన డామినేషన్ పూర్తిగా ఉండేది. మొత్తం రాజకీయాలన్నీ ఉమా కనుసన్నలోనే జరిగేవి. ఆయన డామినేషన్ తట్టుకోలేక కొడాలి నాని లాంటి నేతలు పార్టీని కూడా వదిలేశారు. అయినా చాలామంది నేతలు దేవినేని ఉమా వెనుకే నడిచారు.
అటు 2014లో అధికారంలో ఉన్నప్పుడూ కూడా ఈయన మాట బాగానే చెల్లుబాటు అయ్యేది. కానీ మొన్న ఎన్నికల్లో ఓటమి తర్వాత జిల్లా రాజకీయాల్లో పూర్తిగా మార్పు వచ్చింది. దేవినేని కూడా ఓడిపోవడంతో ఆయన మాటని లెక్క చేసే నాయకుడు లేకుండా పోయారు. ఇప్పుడు కూడా జిల్లాలో పెత్తనం చెలాయించాలని చూస్తున్న మిగతా నేతలు సహించట్లేదు. పైగా ఛోటా మోటా నాయకులు తప్ప ఆయన వెంట ఎవరు నడవడం లేదు. అసలు ఉమాకి జిల్లాలోని కొందరు నేతలకి పడటం లేదు. విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ సైలెంట్ గా కనిపిస్తున్న… ఉమా అంటే అస్సలు పడదు.
అటు గన్నవరం ఎమ్మెల్యే వంశీకి ఎప్పటి నుంచి వైరం కొనసాగుతూనే ఉంది. ఒకే పార్టీలో ఉన్న వీరు బద్ద శత్రువులుగానే ఉన్నారు. ఇక విజయవాడ ఎంపీ కేశినేని నాని అయితే ఉమాపై బహిరంగంగానే విమర్శలు చేస్తున్నారు. జిల్లాలో చాలామంది నేతలు ఉమాని పెద్దగా పట్టించుకోవట్లేదు. ఇక మాజీ డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్ లాంటి వాళ్లతోనూ ఉమాకు సఖ్యత లేదు.
ఏదేమైనా తాజా ఎన్నికల తర్వాత జిల్లాలో దేవినేని ఒంటరి వారైపోయారు అనిపిస్తోంది. ఏదైనా ప్రెస్ మీట్ లు పెట్టిన ఆయన ఒకడు మాత్రమే మాట్లాడుకుని వెళ్లిపోతున్నారు. ఆయన తీరు వల్లే ఒంటరిగా మిగిలిపోయినట్లు కనపడుతోంది. ఇప్పటికైనా ఉమా డామినేషన్ తగ్గించుకుని రాజకీయాలు చేస్తే బాగుంటుందేమో అన్నది ఆ పార్టీ నేతల నుంచే వినిపిస్తోన్న మాట.